ఏపీ ప్రజలకు అలర్ట్.. జులై 10న రాత్రికి కుండపోత వర్షం

ఏపీ ప్రజలకు అలర్ట్..   జులై 10న రాత్రికి కుండపోత వర్షం

వారం రోజులుగా వర్షాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం (జులై 9) కూడా పలు జిల్లాల్లో మోస్తరు జల్లులు కురిశాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురిశాయి. రుతుపవనాలు ఊపందుకోవడంతో వాన ముసురు మొదలైంది. రైతుల కూడా వ్యవసాయ పనుల్ని ముమ్మరం చేశారు. మరోవైపు సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

పలు జిల్లాల్లో కుండపోత
 
ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. కోస్తాతో పాటుగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో వానలు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రానున్న మూడు రోజుల్లో.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రతో పాటు యానాం, ఉత్తర కోస్తాలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. సోమవారం (జులై 10) రాత్రికి విశాఖ, గుంటూరు, గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం అత్యధికంగా తిరుపతి జిల్లా పాకాలలో 32.4 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో 13.2, గుంటూరు జిల్లా లాంలో 10.5, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 7.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రెండు వారాల క్రితం తగ్గిన ఎండలు కాస్త పెరిగాయి.. మళ్లీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వర్షాలు ఊపందుకున్నాయి.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనుల్ని ముమ్మరం చేస్తున్నారు.

ALSO READ :జపాన్లో భారీ వర్షాలు... ఆరుగురు మిస్సింగ్

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం

ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఈ వానలతో పాటుగా సీజనల్ వ్యాధులు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అంటు వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు ప్రారంభిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించబోతున్నారు. వాలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వేలో భాగంగా.. ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేను నిర్వహిస్తారు. అలాగే మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.