తుంగభద్రకు తూట్లు : ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ

తుంగభద్రకు తూట్లు : ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ

ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ
రూ.2 వేల కోట్లతో పనులకు శ్రీకారం
నడిగడ్డను ఎండబెట్టే స్కీంను స్పీడప్ చేసిన ఆంధ్రా సర్కారు
మన రాష్ట్రం వాడుకుంటున్నది కేటాయింపుల్లో మూడో వంతే
కుడి కాల్వ తవ్వితే పాలమూరుకు తీవ్ర నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలంలో చేరే ప్రతి చుక్క నీటిని తరలించుకుపోయేందుకు సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంను పరుగులు పెట్టిస్తున్న ఏపీ సర్కారు.. ఇప్పుడు మరో కొత్త కుట్రకు తెరతీసింది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్‌‌ ఆనకట్ట)కు కుడివైపు కాల్వ తవ్వి.. మహబూబ్​నగర్​ జిల్లాకు వస్తున్న కొద్దిపాటి నీళ్లను కూడా ఎత్తుకపోయేందుకు రెడీ అయింది. తుంగభద్ర నీళ్లను మొత్తానికి మొత్తం మళ్లించుకునే ప్లాన్ వేసింది. ఇందుకోసం అసలు అమల్లోకే రాని బ్రిజేశ్ ట్రిబ్యునల్‌‌ (కేడబ్ల్యూడీటీ–2) అవార్డును ముందుపెట్టింది. ఆర్డీఎస్‌‌ రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు ఆ ట్రిబ్యునల్ నాలుగు టీఎంసీల నీటిని కేటాయించిందంటూ.. ఏకంగా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు మొదలుపెట్టింది. రూ.2 వేల కోట్లతో పనులు చేపట్టడానికి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. ఆర్డీఎస్ నుంచి నీళ్లను మళ్లించేస్తే.. ఐజ, అలంపూర్‌‌ ప్రాంతాలు ఎడారిగా మారుతాయని ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ ఆయకట్టు అని చెప్తూ..

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు, కర్నాటక రాష్ట్రంలోని రాజోలిబండ, బత్తల బొమ్మలాపురం మధ్య తుంగభద్రపై రాజోలిబండ డైవర్షన్‌‌ స్కీం ఉంది. ఈ ఆర్డీఎస్​కు కుడి వైపు కర్నూల్ జిల్లా అగసనూరు సమీపంలో కాల్వ తవ్వడానికి ఏపీ సర్కారు రెడీ అయింది. దాని ద్వారా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు నియోజకవర్గాల్లోని 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లోనే రూ.1,985 కోట్లతో ఈ పనులకు అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారు.

ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ సంస్థ ఈ పనులు చేపట్టేందుకు అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ కూడా చేసుకుంది. ఈ కొత్త ప్రాజెక్టు కోసం 22 ఎకరాల అటవీ భూమి, 4,973 ఎకరాల ప్రైవేటు భూములు అవసరమని లెక్క తేల్చారు. ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ ఆనకట్ట నుంచి 160 కిలోమీటర్ల కాల్వ తవ్వి దానిపై నాలుగు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రైట్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌పై కోసిగి, పెద్దకందుకూరు వద్ద 0.5 టీఎంసీల చొప్పున, కోటేకల్‌‌‌‌‌‌‌‌ వద్ద 1.5 టీఎంసీలు, చిన్న మర్రివీడు వద్ద 0.25 టీఎంసీల కెపాసిటీతో నాలుగు కొత్త రిజర్వాయర్లను ప్రతిపాదించారు. వీటిపై నాలుగు లిఫ్టులు పెట్టి 40 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని పేర్కొన్నారు. కానీ నిజానికి ఈ స్కీంల కింద ఏకంగా ఐదు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశారు.

మొత్తానికే ముంచే కుట్ర

గద్వాల నడిగడ్డ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏకైక దిక్కు ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ ఆనికట్‌‌‌‌‌‌‌‌. అలాంటి దీని నుంచి కుడి కాల్వ తవ్వి వీలైనన్ని ఎక్కువ నీళ్లను మళ్లించుకుపోవాలని ఏపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటున్న 6 టీఎంసీల నీళ్లు కూడా దక్కకుండా పోయేలా చేసే పనులు చేపడుతోంది. దీనివల్ల వందకుపైగా గ్రామాలకు మంచి నీళ్లు కూడా అందని పరిస్థితి వస్తుంది. తమ కొత్త ప్రాజెక్టుకు బ్రిజేశ్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ నుంచి నీటి కేటాయింపులున్నాయని చెప్తున్న ఏపీ సర్కారు.. ఆ ట్రిబ్యునల్​ ఆదేశాలు అమల్లోకే రాలేదన్న వాస్తవాన్ని మాత్రం చెప్పడం లేదు. అంతేకాదు కుడి కాల్వ తవ్వకానికి బ్రిజేశ్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ పెట్టిన షరతులను కూడా తుంగలో తొక్కుతోంది. ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ రైట్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ తవ్వాలంటే.. తుంగభద్ర నదిలో నీటి లభ్యతను లెక్కించి, మిగులు జలాల్లోంచి నాలుగు టీఎంసీలు తీసుకోవాలి. ప్రస్తుతం తుంగభద్రలో మిగులు జలాలు ఉండటమే లేదు. ఇలా మిగులు జలాల్లేకుంటే కర్నాటకలోని ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌‌‌‌‌‌‌‌కు అదనంగా 4 టీఎంసీల వరద జలాలను తరలించాలి. అక్కడి నుంచి ప్రత్యేక కాల్వ ద్వారా ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌కు తెచ్చుకోవాలి. ఈ లెక్కన కర్నాటకలోనే భూమిని సేకరించుకుని, కాల్వ తవ్వుకోవాల్సి ఉంటుంది. దానికి కర్నాటక ఓకే చెప్పే చాన్స్​ లేకపోవడంతో.. ఏపీ ఏకపక్షంగా ఆర్డీఎస్​ వద్ద పనులు మొదలు పెట్టింది. తెలంగాణ సర్కారు వెంటనే కేంద్రానికి కంప్లైంట్​ చేసి.. ఏపీ ప్రాజెక్టు పనులను ఆపించాలని నడిగడ్డ ప్రాంత రైతులు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

సుంకేశుల నుంచి కేసీ కెనాల్ నాలుగింతలు నీళ్లు

బ్రిటిష్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో మద్రాస్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌గా, నిజాం సంస్థానం ఇండిపెండింట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడే తుంగభద్ర నీటి వినియోగంపై ఒప్పందాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా సుంకేశుల ఆనకట్ట నుంచి కాలువ ద్వారా16 టీఎంసీలతో అక్కడి 80 వేల ఎకరాలకు.. అప్పటి నిజాం సంస్థానంలోని రాయచూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా (ప్రస్తుతం కర్నాటక రాష్ట్రం) రాజోలిబండ గ్రామంలోని ఆనికట్‌‌‌‌‌‌‌‌ ద్వారా మరో 16 టీఎంసీలతో ఇక్కడి 80 వేల ఎకరాలకు నీళ్లు తీసుకునేలా రూల్​ పెట్టుకున్నారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటయ్యాక.. ఆర్డీఎస్‌‌‌‌‌‌‌‌ ఆయకట్టు 80 వేల ఎకరాల నుంచి 40 వేల ఎకరాలకు తగ్గిపోయింది. అదే ఏపీలోని సుంకేశుల ఆనికట్‌‌‌‌‌‌‌‌ ను బ్యారేజీగా డెవలప్ చేసుకున్నారు. అక్కడి నుంచి కేసీ కెనాల్ ద్వారా ఏపీ సర్కారు 40 టీఎంసీల నీటిని వాడుకుంటూ నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తోంది.

ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి

ఏపీ సర్కార్​ అక్రమంగా ఆర్డీఎస్ రైట్ మెయిన్ కెనాల్, లిఫ్ట్ స్కీంలు చేపట్టింది. ఆర్డీఎస్ నుంచి ఇప్పుడు 6 టీఎంసీలు కూడా తీసుకోలేకపోతున్నాం. ఏపీ కొత్త ప్రాజెక్టులు పూర్తయితే అలంపూర్ ప్రాంతానికి తీవ్ర నష్టం తప్పదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ చర్యలను అడ్డుకోవాలి. కర్నాటక ప్రభుత్వంతో చర్చించి ఆర్డీఎస్ కాల్వను త్వరగా బాగు చేసుకోవాలి. తుమ్మిళ్ల సెకండ్ ఫేజ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. జూరాల నుంచే కృష్ణా నీటిని సాధ్యమైనంత ఎక్కువగా తరలించే లిఫ్ట్ స్కీం ను ప్రయారిటీ గా తీసుకొని పనులు ప్రారంభించాలి.

– ఎన్. రంగారెడ్డి, ఎక్స్ ఓఎస్డీ టు సీఎం, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీం

6 టీఎంసీలే వాడుకుంటున్నం

ఆర్డీఎస్‌‌ నుంచి మనకు 15.90 టీఎంసీల కేటాయింపులున్నా తూములు, కాలువ నిర్వహణ సరిగా లేక మన రాష్ట్రం ఆరేడు టీఎంసీలకు మించి వాడుకునే పరిస్థితి లేదు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ, వడ్డేపల్లి, ఆలంపూర్‌‌ మండల్లాల్లోని 80 వేల ఎకరాలకు ఈ నీళ్లను ఇవ్వాల్సి ఉంది. ఆర్డీఎస్‌‌ నుంచి పూర్తిస్థాయిలో నీళ్లు రాకపోవడంతో సుంకేశుల బ్యాక్‌‌ వాటర్‌‌ లో తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ చేపట్టి దానిని పాక్షికంగా అందుబాటులోకి తెచ్చినా వినియోగం 6 టీఎంసీలు దాటలేదు, అలంపూర్‌‌ ప్రాంతానికి నీళ్లు సరిగా అందడం లేదు. ఉమ్మడి ఏపీలో ఆర్డీఎస్‌‌ ఆనకట్ట వద్ద కర్నూలు నేతలు రివర్‌‌ స్లూయిజ్‌‌లను ధ్వంసం చేసి అక్రమంగా నీళ్లు మళ్లించుకుపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 2010లో గ్యాస్‌‌ కట్టర్లతో స్లూయిజ్‌‌లను ధ్వంసం చేసి మరీ నీటిని తరలించుకు పోయారు.