
Anil Ambani: గడచిన కొన్ని త్రైమాసికాల నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీల పనితీరు మెరుగుపడుతూ వస్తోంది. ప్రధానంగా అనిల్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థల రుణాలను చెల్లిస్తూ వాటి వ్యాపారాలను తిరిగి గాడిన పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రుణాలను పూర్తిగా చెల్లించిన ఆయన వ్యాపారవేత్తగా తన రెండవ ఇన్నింగ్స్ విజయవంతంగా దశాబ్ధకాలం తర్వాత టేకాఫ్ చేశారు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ కామ్ రుణ ఖాతాలను మోసంగా వర్గీకరించటం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 23, 2025న లేఖలో రిలయన్స్ కమ్యూనికేషన్ రుణ ఖాతాను "ఫ్రాడ్"గా వర్గీకరించినట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు కూడా వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ దివాలా ప్రక్రియ కింద ఉంది. కంపెనీ క్రెడిటర్ల కమిటీ ఇప్పటికే ఒక రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదించగా.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ నుంచి అనుమతి కోసం వేచి చూస్తోంది.
స్టేట్ బ్యాంక్ ఫ్రాడ్ కమిటీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాలను ఫ్రాడ్ కింద వర్గీకరించటంతో పాటు కంపెనీ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించాలని భావిస్తున్నట్లు బీఎస్ఈకి జూలై 1న వెల్లడించింది. అయితే దీనికి కొన్ని నెలల ముందు నవంబర్ 2024లో మరో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాలను మోసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ నుంచి పొందిన రూ.వెయ్యి 50 కోట్ల రుణాలను దుర్వినియోగం చేసిందని కెనరా బ్యాంక్ ఆరోపించింది. కానీ బాంబే హైకోర్టు ఫిబ్రవరి 2025లో ఆ నిర్ణయాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఆర్ కామ్ సంస్థ, దాని ఆస్తులు జూన్ 2019 నుంచి కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఉన్నాయి. అయితే ఈ సమయంలో రుణాలు అందించిన సంస్థలు లేదా వ్యక్తులు కంపెనీపై ఎలాంటి దావా లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవటం కుదరదని రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెబుతోంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ తీసుకున్న చర్య చట్టబద్దంగా బలహీనంగా ఉందని అయినప్పటికీ దీనిపై న్యాయపరమైన సలహాతో ముందుకెళతామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది.