కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు.  మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది 6 నెలల్లో 21 శాతం  యాక్సిడెంట్లు తగ్గాయన్నారు.  2024లో 317 యాక్సిడెంట్లు కాగా, 152 మంది మృతి చెందారన్నారు. ఈసారి 282 ప్రమాదాలు జరిగితే 120 మంది చనిపోయారన్నారు. మరణాల్లో 22 శాతం తగ్గిందన్నారు. యాక్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో  ప్రతి రోజు వెహికల్స్​ తనిఖీలు,  డ్రంక్ అండ్​ డ్రైవ్​ టెస్టులు, హెల్మెట్, డ్రైవింగ్​ లైసెన్స్​ లేని  వారికి, స్పీడ్​గా వెళ్లే వారికి ఫైన్లు విధించటం వల్ల సాధ్యమైందన్నారు.  6 నెలల్లో  లైసెన్స్​లేని వారు 75,179,  ఓవర్​ స్పీడ్ 43,348,  హెల్మెట్​ లేని వారు  16,340,  డ్రంక్ అండ్ డ్రైవ్ 5,942 ఫైన్లు వేశామన్నారు. 28 బ్లాక్​ స్పాట్​లను గుర్తించి  సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి  నివారణ చర్యలు చేపట్టామన్నారు. 

దొంగతనాలు కూడా తగ్గాయన్నారు.  గతంలో  259 చోరీలు అయితే, ఈసారి  214 జరిగాయన్నారు.  వరకట్న వేధింపుల కేసులు గతంలో 174 ఉంటే, ఈ ఏడాది167 ఉన్నాయన్నారు. అంతర్​ర్రాష్ట్ర పార్ధి గ్యాంగ్ 11 మంది సభ్యుల ముఠాను అరెస్ట్​చేసినట్లు ఎస్పీ తెలిపారు.  సీఐఈఆర్ అప్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు 3,265 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామన్నారు.  జిల్లా పోలీసుల కోసం కొత్త లోగో అవిష్కరించామన్నారు.  డయల్ 100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్నారు.  రానున్న ఈ 6 నెలల్లో నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.   వర్షాల దృష్ట్యా ప్రజలను అలర్ట్​చేశామన్నారు.