కంటికి రెప్పలా : చంద్రబాబుకు జైలులోనే స్పెషలిస్టు డాక్టర్ల బృందం..

కంటికి రెప్పలా : చంద్రబాబుకు జైలులోనే స్పెషలిస్టు డాక్టర్ల బృందం..

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుకు.. వైద్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఆయనకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కస్టడీలో భాగంగా జైలులోనే సీఐడీ అధికారులు చంద్రబాబును విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

జైలులోనే చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించటానికి వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఈ వైద్య బృందంలో కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్టు డాక్టర్లు ఉన్నారు. అదే విధంగా మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ నలుగురు డాక్టర్లతోపాటు మరో నలుగురు నర్సులు కూడా జైలులోనే ఉన్నారు. ఇక చంద్రబాబు బ్లడ్ గ్రూపునకు సంబంధించిన రక్తాన్ని సైతం సిద్ధంగా ఉంచారు. ఓవరాల్ గా జైలులోనే చంద్రబాబుకు కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంది. చంద్రబాబు బీపీ, షుగర్ తోపాటు మరికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికితోడు ఆయన వయస్సు కూడా 74 ఏళ్లు.. మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు విచారణ చేస్తుండటంతో.. ముందు జాగ్రత్తగా డాక్టర్ల బృందాన్ని అందుబాటులో ఉంచారు అధికారులు.

అత్యవసరం అయితే రాజమండ్రిలో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించటానికి కూడా అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ బెడ్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జైలు అధికారులు, సీఐడీ అధికారులు వెల్లడించారు.