పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ విజ్ఞప్తికి టీటీడీ స్పందన.. మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ విజ్ఞప్తికి టీటీడీ స్పందన.. మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

కాకా వర్ధంతి సందర్భంగా ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ. కాలినడకన  అలిపిరి మెట్ల మార్గంలో వెళుతున్న సమయంలో నెలకొన్న దయనీయ పరిస్థితులపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

భక్తితో మెట్ల మార్గం ద్వారా కొండలెక్కుతున్న సమయంలో అక్కడ ఏర్పడిన పరిస్థితులు తన మనసును తీవ్రంగా కలచివేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండల మెట్ల మార్గంలో  దారి పొడవునా ప్లాస్టిక్ వ్యర్థాలు, కన్‌స్ట్రక్షన్ వేస్ట్ పేరుకుపోయి ఉండటం వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. టాయిలెట్ రెన్నోవేషన్ల పేరుతో ఏర్పాటు చేసిన కమోడ్లు, మెట్ల మధ్యలో పెట్టిన స్టీల్ ట్రేల కారణంగా భక్తులు సరిగా నడవలేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, కాళ్లకు గాయాలయ్యే అవకాశం అధికంగా ఉందని తెలిపారు.

 మెట్ల మార్గంలో   ఎక్కడా కూడా కనీసం ఫస్ట్‌ఎయిడ్ కేంద్రాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మోకాళ్ళ మెట్టు వద్ద భక్తులు బస్సులు, కార్ల మధ్య నుంచి ప్రాణాలకు తెగించి రోడ్డు దాటాల్సి వస్తోందని, ఇది భక్తుల భద్రతపై తీవ్రమైన నిర్లక్ష్యానికి అద్దంపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

అలిపిరి నడక మార్గంలో పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. భక్తుల భద్రత, శుభ్రత, గౌరవంతో దర్శనం జరగడం అత్యంత ప్రాధాన్యమని, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో ఇటువంటి పరిస్థితులు తావులేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

దీనిపై  రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. మంత్రి ఆదేశాలతో టీటీడీ వెంటనే స్పందించింది.  అలిపిరి నడకమార్గంలో 7వ మైలు దగ్గర  డిస్పెన్సరీ ఏర్పాటు చేసింది. నడిచి వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యం అందించేలా ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయిడు, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రారంభించారు.  రెండు బెడ్లతో పాటు  అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు.  దశల వారీగా వైద్య సౌకర్యాలు పెంచి భక్తులకు అత్యవసర చికిత్సలు అందించనున్నారు...