కృష్ణానీళ్లపై సుప్రీంకు ఏపీ

కృష్ణానీళ్లపై సుప్రీంకు ఏపీ

తెలంగాణ మా హక్కులను హరిస్తోందని పిటిషన్​
బచావత్‌ అవార్డును ఉల్లంఘిస్తోందని ఆరోపణ

హైదరాబాద్‌, వెలుగు: తమ రాష్ట్ర ప్రజల జీవించే హక్కును తెలంగాణ హరిస్తోందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌, బచావత్‌ అవార్డును ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొంది. తమ రాష్ట్రానికి కృష్ణా నీళ్లలో హక్కుగా లభించే వాటా దక్కకుండా కరెంట్‌ ఉత్పత్తి చేస్తూ నీళ్లను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితి తెచ్చిందని ఆరోపించింది. 

పిటిషన్‌‌‌‌లో ప్రతివాదులుగా కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం, టీఎస్‌‌‌‌ జెన్‌‌‌‌కోలను ప్రతివాదులుగా చేర్చింది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌‌‌‌ మహఫోజ్‌‌‌‌ ఎ.నజ్కీ ఈ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ‘కేఆర్‌‌‌‌ఎంబీ జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ నోటిఫై చేసి ప్రాజెక్టులతో పాటు హైడల్‌‌‌‌ పవర్‌‌‌‌ స్టేషన్లను దాని పరిధిలోకి తేవాలి. ప్రాజెక్టులపై సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ బలగాలతో భద్రత కల్పించాలి. నదీ జలాల్లో వాటాలపై ట్రిబ్యునల్‌‌‌‌ ఇచ్చిన అవార్డులు కచ్చితంగా అమలు చేయాలి. ట్రిబ్యునల్‌‌‌‌ కేటాయింపులకు మించి నీటిని వాడుకోవడం, అందుకోసం ప్రాజెక్టులు కట్టడం, ఉన్న ప్రాజెక్టుల కెపాసిటీ పెంచడం లాంటి చర్యలు అడ్డుకునేందుకు శాశ్వత పరిష్కారం చూపించాలి. బచావత్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు ప్రకారం తాగు, సాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాల కోసం మాత్రమే కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది. తమ రాష్ట్రానికి సాగు, తాగునీటి అవసరాలు లేకున్నా తెలంగాణ ప్రభుత్వం కరెంట్‌‌‌‌ ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం జూన్‌‌‌‌ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలి. కరెంట్‌‌‌‌ ఉత్పత్తి ఆపేయాలని కేఆర్‌‌‌‌ఎంబీ ఇచ్చిన ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌‌‌‌ సిబ్బంది, పోలీసులు ఘర్షణ దిగే వాతావరణం తెలంగాణ కల్పిస్తోంది. తమ న్యాయమైన హక్కులు పరిరక్షించేలా ఆదేశాలు ఇవ్వాలి...’ అని ఆ పిటిషన్‌‌‌‌లో ఏపీ కోర్టును కోరింది.