
- పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి
- నిరుడుతో పోలిస్తే 21 రోజుల ముందుగానే..!
- కృష్ణా బోర్డు పర్మిషన్ కూడా తీసుకోలే
- వచ్చిన నీళ్లు వచ్చినట్టు తరలించే ప్లాన్
- నాగార్జునసాగర్ నిండాలంటే మరో నెలన్నర సమయం
- ఏపీ తీరు తెలంగాణ ప్రయోజనాలకు నష్టమంటున్న అధికారులు
- చంద్రబాబు ఆదేశాలతో విడుదల చేసినం: ఏపీ మంత్రి జనార్దన్ రెడ్డి
- బనకచర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్.. కట్టి తీరుతామని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటి తరలింపు మొదలైంది. అక్కడి నుంచి రాయలసీమకు గేట్వేగా పిలిచే బనకచర్ల కాంప్లెక్స్, అటు నుంచి రాయలసీమ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నది. మామూలుగా ఏటా జులై నెలాఖరు లేదా ఆగస్టులో పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల జరిగితే.. ఈ ఏడాది జులై మొదటి వారం నుంచే ఏపీ నీటిని తోడుకెళ్తుండటం గమనార్హం. నిరుడుతో పోలిస్తే ఇప్పుడు 21 రోజుల ముందుగానే నీటి తరలింపు షురూ అయింది.
శ్రీశైలం ప్రాజెక్టులో ఇంకా 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నా కూడా నీటి తరలింపును ఏపీ మొదలుపెట్టింది. కనీసం కృష్ణా బోర్డు అనుమతి కూడా తీసుకోకుండానే ఈ పని ప్రారంభించేసింది. శ్రీశైలం ఉమ్మడి ప్రాజెక్ట్ కావడంతో.. నీటి విడుదలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి తప్పనిసరి. కానీ, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఆదివారం ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. కనీసం ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే నీటిని తరలిస్తుండడంతో మన ప్రయోజనాలకు భంగం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
నాగార్జునసాగర్‌కు లోటే..
వాస్తవానికి వరద ప్రవాహం మొదలై ఎగువన ప్రాజెక్టులు నిండితే.. దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీళ్లను విడుదల చేస్తుంటారు. ఎగువన ఉన్న వరద అంచనాల ఆధారంగా నీటిని విడుదల చేసుకునేందుకు చాన్స్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు నిండడానికి వచ్చినా.. నాగార్జునసాగర్‌కు మాత్రం ఇంకా భారీ వరదలు రావడం లేదు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన భారీ వరదలు వచ్చి ప్రాజెక్టులు నిండితే తప్ప సాగర్ నిండే పరిస్థితి లేదు. నాగార్జునసాగర్ నిండాలంటే కనీసం మరో నెల, నెలన్నర టైం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
కానీ, ఏపీ మాత్రం శ్రీశైలం ఇలా నిండుతుండగానే.. అలా ఖాళీ చేసేందుకు పూనుకుంటున్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,76,434 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలకుగానూ.. 184.2774 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకుగానూ.. 160 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రాజెక్టుకు 56,676 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
బనకచర్ల పూర్తి చేస్తం: ఏపీ మంత్రి జనార్దన్‌రెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఏపీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. నిరుడు జులై 27న, అంతకుముందు ఆగస్టులోనే నీళ్లను విడుదల చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు ముందుగానే వరద వస్తుండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగుగంగ, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా, ఎస్ఆర్బీసీ కాల్వలకు నీటిని విడుదల చేశామన్నారు. త్వరలోనే బనకచర్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
గోదావరిలో మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెప్తున్నా.. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు తాపత్రయపడుతున్నాయని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఏపీ ఇరిగేషన్ సెక్టార్లో ఈ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అవుతుందని, రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. కాగా, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నీటిని విడుదల చేశారు.