తెలంగాణలో యాపిల్ సాగు

తెలంగాణలో యాపిల్ సాగు
  • ఆదిలాబాద్‌‌,భూపాలపల్లి, ములుగు జిల్లాల్ లో ని అటవీ ప్రాంతాలు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు
  • వికారాబాద్‌‌ జిల్లా అనంతగిరి పరిసర ప్రాంతాలు

యాపిల్​ పండ్లు అనగానే మన కాశ్మీర్, సిమ్లా, చలి ఎక్కువగా ఉండే యూరప్ ​దేశాలే గుర్తొస్తయి. ఎందుకంటే చల్లగా ఉండే దగ్గరే యాపిల్​ చెట్లు పెరుగుతయి, పండ్లు వస్తయి. వేడి వాతావరణం ఉన్న దగ్గర ఆ చెట్లు పెరగయి, పెరిగినా పండ్లు పండయి. అయితే వేడిగా ఉండే మన ప్రాంతాల్లోనూ యాపిల్​ పండించొచ్చని వ్యవసాయ నిపుణులు చెప్తున్నరు. ఇప్పటికే ఇజ్రాయెల్, సౌతాఫ్రికా వంటి ఉష్ణ దేశాల్లో యాపిల్స్​ను పండిస్తున్నరని, అట్లాంటి రకాలు తెచ్చుకుంటే మన దగ్గర కూడా వేయవచ్చని అంటున్నరు. అయితే పగలు ఉష్ణోగ్రత ఎక్కువగ ఉన్నా.. రాత్రి బాగా చల్లగా ఉండే ప్రాంతాలు అయితే బెటరని, అలా ఉంటే యాపిల్స్​ దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్తున్నరు.

ఏజెన్సీ ప్రాంతాల్లో..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లోనూ యాపిల్​ను పండిస్తున్నారు. ఇజ్రాయిల్‌‌ లాంటి ఎడారి ప్రాంతాలు, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ సాగవుతోంది. మన దేశంలో మాత్రం కాశ్మీర్‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, ఉత్తరాఖండ్‌‌  రాష్ట్రాలకే పరిమితమైంది. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ పండించడంపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు దృష్టి సారించారు. రైతులు మూడేళ్లపాటు మొక్కలను సంరక్షిస్తే.. ఆ తర్వాతి 20 ఏళ్ల పాటు ఏటా ఫలసాయం వస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌‌, వికారాబాద్‌‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో యాపిల్​ను పండించే అకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికే ప్రయోగాలు..

ఐదేళ్ల కిందే రాష్ట్రంలో యాపిల్స్​ పండించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్‌‌, విశాఖ జిల్లా పాడేరు ప్రాంతాల్లో హైడెన్సీ విధానంలో సాగు మొదలుపెట్టారు. అయితే తక్కువ ఉష్ణోగ్రతలో పండే రకాలనే ప్రయోగాత్మకంగా నాటారు. ఏపీలోని పాడేరు, లంబసింగి ప్రాంతంలో వాతావరణం యాపిల్ సాగుకు అనుకూలం. అక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్  డిగ్రీలకు కూడా తగ్గుతాయి. 2016 జనవరిలో 10 వేల మొక్కలను ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు సప్లై చేయగా.. ఈ ఏడాది నుంచి దిగుబడి రావడం మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ లో పండుతున్న అన్నా, డార్సెట్ గోల్డెన్ రకాలను ఇక్కడ నాటారు. శీతల ప్రాంతాల్లో డిసెంబర్‌‌, జనవరి నెలల్లో యాపిల్​ చెట్లు పూర్తిగా మంచుతో కప్పుకుపోయి నిద్రావస్థలో ఉంటాయని.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేనందున ఏటా రెండు పంటలు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణుడు పురుషోత్తమరావు చెప్పారు.

ఆ రకాలు తెస్తే..

యాపిల్స్​లో గోల్డెన్‌‌ డెలీషియస్‌‌, రాయల్‌‌ గాలా, గ్రానీ స్మిత్‌‌, క్రిప్స్ పింక్‌‌, స్టార్కింగ్‌‌, ఫుజీ, క్రిప్స్‌‌రెడ్‌‌, బీబర్న్‌‌ తదితర రకాలు ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా, సౌతాఫ్రికాల్లో, ఇజ్రాయిల్‌‌ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్నా అనే ప్రత్యేక రకాన్ని సాగు చేస్తున్నారు. దీనిని అందుబాటులోకి తెస్తే.. తెలంగాణ అంతటా యాపిల్​ సాగు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ రకాన్ని ఇప్పటికే కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడులోని ఊటీ, మహారాష్ట్రలో నాసిక్​ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ఇక హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లోని హరిమన్‌‌ శర్మ అనే రైతు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండే రకాన్ని అభివృద్ధి చేశారు. దానికి చిల్లింగ్‌‌  హవర్స్‌‌ అవసరం లేదని అంటున్నారు.

చల్లగా ఉండే చోట

యాపిల్​ మొక్క నాటిన మూడేళ్ల నుంచి దిగుబడి మొదలవుతుంది. ఏడాదికి కనీసం 200 గంటల పాటు రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీలు, అంతకన్నా తక్కువగా ఉండాలి. పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు ఉంటే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. నేషనల్‌‌ హార్టికల్చర్‌‌  బోర్డు గుర్తింపు పొందిన హిమాచల్ ప్రదేశ్‌‌లోని నర్సరీల నుంచి తెచ్చుకుని ఇక్కడ నాటుకోవచ్చు. డిసెంబరు, జనవరి నెలలు రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, పగలు 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో బాగా పండించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రకాలు 40 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకూ తట్టుకోగలవని నిపుణులు చెప్తున్నారు.

రూ.8 వేల కోట్ల వ్యాపారం

దేశీయ యాపిల్స్​ వ్యాపారం ఏటా రూ.8 వేల కోట్లకుపైనే ఉంది. సుమారు ఏడు లక్షల కుటుంబాలు యాపిల్‌‌  సాగులో ఉన్నాయి. కాశ్మీర్‌‌, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, ఉత్తరాఖండ్‌‌ రాష్ట్రాల్లో పండే రకాలు మన రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌‌ పండ్ల మార్కెట్‌‌కు రోజుకు 40కిపైగా ట్రక్కుల్లో సుమారు 600 టన్నుల యాపిల్స్​ దిగుమతి అవుతున్నాయి. కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు లెక్కన చూసినా.. నిత్యం 3, 4 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

సౌతాఫ్రికా రకం రావాలి

1983లో రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం మొదలుపెట్టిన. 1995లో ఆలుగడ్డల సాగు విషయంగా హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళ్లిన. సీపీఆర్‌ఐలో సభ్యుడిగా చేరిన. అక్కడ యాపిల్‌ పంటను చూసి ఆసక్తి కలిగింది. అక్కడ 12 ఏండ్ల పాటు సాగు చేశాను. తర్వాత 2014లో తెలంగాణ, ఏపీల్లో ప్రయోగాత్మకంగా యాపిల్స్​ సాగు ప్రారంభించిన. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నా. హైడెన్సీ విధానం అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయి. సౌతాఫ్రికా రకం అందుబాటులోకి వస్తే తెలంగాణ మొత్తం యాపిల్​ పంట వేసే అవకాశం ఉంది.

– పురుషోత్తమరావు, వ్యవసాయ నిపుణుడు