
పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో బాధిత కుటుంబాలకు తక్షణ సాయం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని, గాయపడ్డ వారికి రూ.50 వేల ప్రభుత్వ సాయం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సాయం నష్ట పరిహారం కాదని అధికారులకు చెప్పారు సీఎం. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్30) భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 42 మంది చనిపోయారు. ఇంకా 40 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
►ALSO READ | పాశమైలారం ఘటన: సిగాచీ యాజమాన్యంపై సీఎం ఆగ్రహం.. 24 గంటలైనా స్పందించరా..?
మంగళవారం (జులై 01) సీఎం రేవంత్ ఉదయం మంత్రులతో కలిసి ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు . సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరాతీశారు. సీఎంతో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.