చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి

చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి


సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడి, తిరిగి పనిచేసుకోగలిగే వారికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, గురుకులాలో సీట్ల గురించి మాట్లాడాలని అధికారులకు సూచించామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం తరఫున వైద్యం అందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

మంగళవారం (జులై 01) మంత్రులు, అధికారులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్.. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న ప్రమాదం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైర్, హైడ్రా, డిజాస్టర్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలో ఆదేశించడం జరిగిందని చెప్పారు.

ఈ ఘటనలో అధికారిక సమాచారం ప్రకారం 36 మంది చనిపోయారని సీఎం రేవంత్ తెలిపారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని, 58 మంది వివరాలు అధికారుల  దృష్టిలోకి వచ్చాయని, మిగతా వారు శిథిలాల కింద ఉన్నారా లేక భయంతో టచ్ లోకి రాలేదా అనేది స్పష్టంగా తెలియదని అన్నారు.

►ALSO READ | గాజాస్కూళ్లపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి..95 మంది పాలస్తీనియన్లు మృతి

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు సీఎం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యం, బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికలన సిద్ధం చేస్తామని చెప్పారు. ఘటనలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుందని..  ప్రాథమిక సమాచారం తర్వాత ప్రమాదపై పూర్తి వివరాలు చెబుతామని అన్నారు. 

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ లో జరగకుండా ఉండేందుకు.. ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు సీఎం రేవంత్.