
వాషింగ్టన్ : సొంత స్మార్ట్‌ఫోన్ చిప్స్‌ను సప్లయ్ చేయడానికి టెక్ దిగ్గజం యాపిల్ ముందడుగు వేసింది. ఇంటెల్ కార్పొరేషన్ మోడమ్ వ్యాపారాలను యాపిల్ 1 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.7వేల కోట్లకు) కొనుగోలు చేసింది. ఈ డీల్ కింద 2,200 మంది ఇంటెల్ ఉద్యోగులు, యాపిల్‌లోకి వెళ్లనున్నారు. అంతేకాక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇక్విప్‌మెంట్, లీజ్‌లు కూడా యాపిల్ చేతికి వెళ్తాయి. ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు వీటిని కలిపితే, యాపిల్ వద్ద 7వేల వైర్‌లెస్ టెక్నాలజీ పేటెంట్స్ ఉండనున్నాయి. సెల్యులార్ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ నుంచి మోడమ్స్ వరకు యాపిల్ చేతిలోనే ఉంటాయి.
ఈ వార్తల నేపథ్యంలో ఇంటెల్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌లో 5.7 శాతం పెరిగి 55.05 డాలర్లుగా ఉన్నాయి. యాపిల్ షేర్లు కూడా 0.1 శాతం పెరిగి 207.29 డాలర్లుగా ట్రేడయ్యాయి. ఈ డీల్ అనంతరం, ఇంటెల్ వద్ద కేవలం నాన్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లకు మాత్రమే మోడమ్‌లను తయారు చేసే హక్కులుంటాయి. అంటే పీసీలు, ఇండస్ట్రియల్ ఇక్విప్‌మెంట్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ఇది మోడమ్‌లు తయారు చేయనుంది. గత ఏడాది కాలంగా ఐఫోన్ మోడమ్ చిప్‌లకు ఇంటెలే ప్రధాన వనరు. ఈ కంపెనీనే వీటికి మోడమ్ చిప్‌లను అందిస్తోంది. అంతకుముందటి సప్లయిర్ క్వాల్‌కామ్ ఇంక్‌తో యాపిల్ చాలాకాలంగా న్యాయపోరాటం చేసింది. ఏప్రిల్‌లోనే ఈ వివాదంపై యాపిల్ సెటిల్‌మెంట్ కుదుర్చుకుంది. 2014లో బీట్స్ ఎలక్ట్రానిక్స్‌ను 3.2 బిలియన్ డాలర్లకు కొన్న తర్వాత ఇంటెల్ డీలే తమకు రెండో అతిపెద్ద ఒప్పందమని యాపిల్ వర్గాలు తెలిపాయి.