ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ జనాన్ని కలవర పెడుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచదేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరికొంత కాలం కొనసాగించాలని కంపెనీలు నిర్ణయించాయి. గూగుల్ సంస్థ ఇప్పటికే ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. తాజాగా మరో టెక్ జెయింట్ యాపిల్ సైతం ఇదే బాట పట్టింది. ఒమిక్రాన్ విజృంభన దృష్ట్యా ఉద్యోగులు తప్పకుండా ఆఫీస్ కు రావాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

వర్క్ ఫ్రం హోం కంటిన్యూ
యాపిల్ కంపెనీ తొలుత 2022 ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాలని ప్రకటించింది. ఫిబ్రవరి తర్వాత వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలకనున్నట్లు చెప్పింది. తాజాగా ఒమిక్రాన్ ఉధృతిని గమనించిన కంపెనీ యాజమాన్యం ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సీఈఓ టిమ్ కుక్ ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. 

ఉద్యోగులకు వెయ్యి డాలర్ల బోనస్
యూపిల్ కంపెనీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించడంతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులు సజావుగా విధులు నిర్వహించేందుకుగానూ ఒక్కో ఎంప్లాయికివెయ్యి డాలర్ల చొప్పున బోనస్ ఇస్తామని టిమ్ కుక్ స్పష్టం చేశారు. గూగుల్ సైతం ఇప్పటికే వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తూ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. నిజానికి ఈ కంపెనీలు ఈ ఏడాది జూన్ నుంచే వర్క్ ఫ్రమ్ హోంకు గుడ్ బై చెప్పాలనుకున్నప్పటికీ సెకండ్ వేవ్ కారణంగా అమలు చేయలేకపోయాయి. ఉద్యోగులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలుతీసుకుని జనవరి నుంచి ఆఫీసుకు రప్పించాలని భావించాయి. కానీ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో కంపెనీలు వెనక్కి తగ్గాయి.