మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పడు మాత్రమే ఆ కుటుంబసభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకానికి అర్హులని, అది కూడా ఏడాదిలోగానే దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగి భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగున్నా అర్హత ఉండదని పేర్కొంది.
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగం చేస్తున్న కుటుంబ పెద్ద మరణించినప్పుడు, ఆయన భార్య ప్రభుత్వ ఉద్యో గం చేస్తున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగున్నా, ఆ కుటుంబ సభ్యులెవరూ కారుణ్య నియామకానికి అర్హులు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పడు మాత్రమే ఆ కుటుంబసభ్యుల్లో ఒకరు కారుణ్య నియమాకానికి అర్హులని, అది కూడా ఏడాదిలోగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఆర్థికపరిస్థితి బాగుండి, ఉద్యోగి లేకపోయినా కుటుంబం ఇబ్బందుల్లేని పరిస్థితుల్లో సదరు ఉద్యోగి మరణించిన నాలుగేండ్లకు కుటుంబంలోని వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే అధికారులు అనుమతించకపోవడం చట్టబద్ధమేనని వెల్లడించింది. ఉద్యోగి మరణించినప్పుడు ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందున అధికారులు కారుణ్య నియామకానికి నిరాకరించారు. ఆ తర్వాత తల్లి రెండో పెండ్లి చేసుకుందంటూ నాలుగేండ్ల తర్వాత పిల్లలు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని ప్రభుత్వం తిరస్కరించడాన్ని హైకోర్టు సమర్థించింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎంఎన్‌ఎంగా పనిచేస్తూ 2018లో తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం చేసుకున్న దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని టి. జీవన సిరి అనే యువతి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేయడంతో దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ పూర్తి చేసింది.
అయితే, పిటిషనర్ తల్లి 2021లో రెండో వివాహం చేసుకోవడంతో వారసురాలిగా నాలుగేండ్ల తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. వారసులుగా సివిల్ కోర్టు నుంచి పొందిన డిక్రీ ఆస్తులు, కారుణ్య నియామానికి కాదన్న సింగిల్ జడ్జి తీర్పును ఆమోదించింది. అప్పీల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.
