కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు  వెయ్యికిపైనే

కాంగ్రెస్ టికెట్ల కోసం అప్లికేషన్లు  వెయ్యికిపైనే
  • ముగిసిన దరఖాస్తు గడువు.. చివరి రోజు పోటెత్తిన ఆశావహులు
  • స్వయంగా వచ్చి అప్లికేషన్ ఇచ్చిన 
  • ఉత్తమ్, పద్మావతి దంపతులు
  • అత్యధికంగా ఇల్లందులో 36 మంది పోటీ
  • కొడంగల్, మధిర నుంచి ఒక్కో దరఖాస్తే
  • జానా, గీతారెడ్డి, రేణుకాచౌదరి అప్లై చేయలే

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ టికెట్​ కోసం అప్లికేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌‌కు క్యూ కట్టారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కూడా కావడంతో చివరి రోజున దరఖాస్తులు సమర్పించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. శుక్రవారం ఒక్కరోజే 300కుపైగా దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా వెయ్యికిపైగా దాఖలయ్యాయని తెలిసింది. ఒక్కో నియోజకవర్గానికి సగటున 9 దరఖాస్తులు వచ్చాయి.

అత్యధికంగా ఇల్లందు నుంచి 36 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. రేవంత్ పోటీ చేయనున్న కొడంగల్, భట్టి నియోజకవర్గమైన మధిర నుంచి ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. జానారెడ్డి, కొండా మురళి, వీహెచ్, రేణుకా చౌదరి, గీతా రెడ్డి వంటి సీనియర్ నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. పారిశ్రామికవేత్తలు, రియల్​ ఎస్టేట్ వ్యాపారులు, సోషల్ వర్కర్లు, కుల సంఘాల నేతలు అప్లికేషన్లు ఇచ్చిన వారిలో ఉన్నారు.జనరల్‌‌తో పోలిస్తే రిజర్వ్‌‌డ్ సెగ్మెంట్లకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

గాంధీభవన్ కిటకిట

ప్రముఖ నేతలందరూ శుక్రవారమే దరఖాస్తులు సమర్పించడంతో గాంధీభవన్ పరిసరాలు కిటకిటలాడాయి. హుజూర్ నగర్ నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి రెడ్డి పోటీ చేసేందుకు దరఖాస్తులను సమర్పించారు. వారిద్దరూ స్వయంగా గాంధీభవన్‌‌కు వచ్చి టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అప్లికేషన్‌‌ను ఆయన ఆఫీస్ సిబ్బంది వచ్చి సమర్పించారు. ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కీగౌడ్ దరఖాస్తును ఇచ్చారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సంగారెడ్డి నుంచి అప్లికేషన్​ పెట్టుకున్నారు. అనుచరులతో కలిసి వచ్చి ఆయన భార్య నిర్మల దరఖాస్తును ఇచ్చారు.

హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ తన అప్లికేషన్​ను అనుచరుల ద్వారా పంపారు. ములుగు నుంచి సీతక్క, పినపాక నుంచి ఆమె కుమారుడు సూర్యం దరఖాస్తు చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మునుగోడు నుంచి హెచ్‌‌సీయూ స్టూడెంట్ లీడర్, పార్టీ అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్, హుజూరాబాద్ నుంచి బల్మూరి వెంకట్, కంటోన్మెంట్ నుంచి సర్వే సత్యనారాయణ అప్లికేషన్​ పెట్టుకున్నారు. ఉత్తమ్, పద్మావతి దరఖాస్తు చేసుకున్న హుజూర్​నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి వారి ముఖ్య అనుచరుడు, సినీ నిర్మాత లేళ్ల అప్పిరెడ్డి రెండు దరఖాస్తులు ఇవ్వడం గమనార్హం.