
- ట్రైబ్స్, నాన్ట్రైబ్స్ నుంచి పోటాపోటీగా దరఖాస్తులు
- సర్కారు నుంచి నేటికీ రాని గైడ్లైన్స్
- ఎంపికలో నామమాత్రంగా మారిన ఎఫ్ఆర్సీలు
- గుట్టుగా ఎంక్వైరీ చేస్తున్నారనే ఆరోపణలు
- ఎఫ్ఆర్సీలను కాదంటే ఉద్యమిస్తామంటున్న గిరిజన నేతలు
పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని గత నెలలో హడావిడి చేసిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు నాన్చుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గిరిజనులు, గిరిజనేతరుల నుంచి సుమారు రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు తీసుకొని రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. దీంతో అప్లికేషన్లను డాటా ఎంట్రీ చేసిన ఆఫీసర్లు గుట్టుగా ఎంక్వైరీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఊరూరా అర్హులను ఎంపిక చేసేందుకు ఫారెస్ట్రైట్స్కమిటీలను వేశాక, ఈవిషయంలో ఆఫీసర్లు తలదూరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని గిరిజన సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఎన్నో ఆశలతో పోడుభూముల పట్టాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకున్న రైతులు, కొత్త సంవత్సరంలోనైనా పట్టాలు చేతికి అందుతాయో, లేదోనని ఆందోళన చెందుతున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్లు వర్సెస్ గిరిజనులు
రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీం- ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ సహా 24 జిల్లాల్లోని 7 లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. గోండులు, కొలాంలు, నాయక్ పోడ్లు, బంజారాలు, కోయలు, తోటి లాంటి గిరిజన తెగలతోపాటు కొంత మంది గిరిజనేతరులు ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ క్రమంలో పోడు భూములపై ఆదివాసీలకు సాగు హక్కులు కల్పించాలని నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ యాక్ట్- –2006' తెచ్చినా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుకాలేదు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఈ సమస్యను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్మరోసారి కదిలించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్నెళ్లలో పోడు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, గిరిజనుల నడుమ వార్ నడుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రయత్నిస్తుంటే, ఆదివాసులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా జరుగుతున్న గొడవల్లో చాలామంది పోడు భూములను కోల్పోవడంతో పాటు కేసులపాలై ఏండ్లతరబడి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఖమ్మం జిల్లాలో పోడు వివాదంలో బాలింతలపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు పంపడంతో సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లో పర్యటించిన హయ్యర్ ఆఫీసర్లు, పోడుభూముల వివరాలు సేకరించారు. తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు గిరిజనులు, గిరిజనేతరుల నుంచి పట్టాల కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల కోసం రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు చెబుతున్నారు.
గైడ్లైన్స్ రాకముందే సీక్రెట్ స్క్రూటినీ
మండల స్థాయిలో ఆఫీసర్లు అప్లికేషన్లయితే తీసుకున్నారుగానీ వాటిని ఎలా స్క్రూటినీ చేయాలి? అర్హులను ఎలా గుర్తించాలనే విషయమై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. దీంతో వచ్చిన అప్లికేషన్లన్నింటినీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ చేస్తున్నారు. అదేసమయంలో ఫారెస్ట్ ఆఫీసర్లు, విలేజ్ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆయా రైతులు ఎన్నేండ్ల నుంచి పోడు సాగులో ఉన్నారు? 2005 కి ముందు నుంచి ఉన్నారా, లేదా, గిరిజనేతరులైతే మూడు తరాల నుంచి సాగులో ఉన్నారా లేదా? అనే విషయమై గుట్టుగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై గిరిజన సంఘాల సర్కారు ఆదేశాలతో ఆఫీసర్లు, గ్రామస్తులు కలిపి ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఏర్పాటుచేశారు. గ్రామసభల్లో ఎన్నుకున్న ఈ కమిటీలే పోడు రైతులో కాదో తేల్చాలి. కానీ ఎఫ్ఆర్సీలతో సంబంధం లేకుండా విలేజ్ సెక్రెటరీలతో అప్లికేషన్లు స్వీకరించడం, ఇప్పుడు గుట్టుగా ఎంక్వైరీ చేస్తుండడంపై గిరిజన సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్రైట్స్కమిటీలను కాదని, ఎంపిక విషయంలో ఆఫీసర్లు తలదూరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎఫ్ఆర్సీ కమిటీ ఆమోదించిన అందరికీ పట్టాలివ్వాలి
అటవీ హక్కుల చట్టంలో నిర్దేశించిన ప్రకారం గ్రామ ఎఫ్ఆర్సీలు అర్హులుగా గుర్తించిన వారందరికీ పట్టాలివ్వాలి. అలా కాకుండా ఎఫ్ఆర్సీలను పక్కనబెట్టి అధికారులు నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఆఫీసుల్లో కూర్చుని ఎఫ్ఆర్సీలతో సంబంధం లేకుండా అప్లికేషన్లు స్క్రూటినీ చేస్తే ఉద్యమాలు తప్పవు.
-భూక్యా వీరభద్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం