
- సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో దందా
- రెండు రూమ్స్‌లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు
- స్కూల్ ఓనర్ సహా ముగ్గురు అరెస్టు
- 8 కిలోల ఆల్ర్ఫాజోలం, రూ.21 లక్షలు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: విద్యార్థులు చదువుకునే స్కూల్‌నే ఆల్ర్ఫాజోలం తయారీకి అడ్డాగా మార్చారు. ఓవైపు క్లాసులు చెప్తూనే, మరోవైపు కల్లులో కలిపే ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టును ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాలెల జయప్రకాశ్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి సాయికాలనీలో మేధా స్కూల్ నడుపుతున్నాడు.
ఇక్కడ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నాడు. అయితే ఏడాది కింద శేఖర్ అనే వ్యక్తి ద్వారా జయప్రకాశ్ గౌడ్‌కు గురువారెడ్డి పరిచయమయ్యాడు. అతని ద్వారా ఆల్ర్ఫాజోలం తయారీ ఫార్ములా తెలుసుకున్న జయప్రకాశ్ గౌడ్.. స్కూల్‌లోనే దాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు రూమ్స్‌లో ల్యాబ్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ తయారు చేసిన ఆల్ర్ఫాజోలంను మహబూబ్‌నగర్‌లోని భూత్పూర్, పరిసర గ్రామాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు.
దీనిపై ఎవరికీ అనుమానం రాకుండా విద్యార్థులు సహా చుట్టుపక్కల వారికి కెమికల్ ల్యాబ్ అని చెప్పేవాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్.. శనివారం స్కూల్‌లో తనిఖీలు చేసింది. దాదాపు రూ.35 లక్షల విలువైన 8 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. జయప్రకాశ్ గౌడ్ సహా ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన కొరియర్ బాయ్ మురళీసాయి, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ ఉదయ్ సాయిని అరెస్టు చేసింది.