
- రేవంత్‌కు సత్తా ఉంటే బై ఎలక్షన్లో గెలిచి చూపించాలి: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి ముంచింది
- గ్రూప్–1 ఉద్యోగాల్లో స్కాం జరిగిందని ఆరోపణ
గద్వాల, వెలుగు: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉందని, రాబోయే 6 నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్లో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి మారిన పది మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలి. సత్తా ఉంటే ఉప ఎన్నికల్లో గెలిచి చూపించాలి’’ అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని దుయ్యబట్టారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ విషయంలో రూ.1,700 కోట్ల స్కాం జరిగిందని ఆయన ఆరోపించారు.
ఒక్కో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని రూ.3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ లీడర్లు గ్రామాల్లో పేద రైతులకు పంపిణీ చేయాల్సిన యూరియా బస్తాలను సైతం బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారని విమర్శించారు. శనివారం గద్వాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ధరూర్ మాజీ జడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, 10 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి అమలు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆయన మాయమాటలు నమ్మి ప్రజలు అధికారం ఇస్తే.. దానిని అడ్డం పెట్టుకొని ప్రజలను వంచిస్తున్నారని కేటీఆర్మండిపడ్డారు. రాష్ట్రం దివాళా తీసిందని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కరోనా సమయంలో ప్రజలంతా ఇంట్లో ఉండి వ్యాపారాలు నడవకున్నా.. ప్రభుత్వానికి నయా పైసా ఆదాయం రాకుండా భారం పడినా.. ఆనాడు కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించారని తెలిపారు.
ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం!
రాబోయే ఆరు నెలల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైలు కింద తలపెడతా కానీ కాంగ్రెస్ లో చేరనని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడారని.. ఇప్పుడు గద్వాలలో మీటింగ్ జరుగుతుంటే ఆయన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారని విమర్శించారు. ఆరునూరైనా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
‘‘రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందట్లేదు. మళ్లీ వ్యవసాయానికి లో ఓల్టోజీ కరెంట్ సమస్య వచ్చింది. సీడ్ కంపెనీలు విత్తనాలు ఇస్తలేరని రైతులు చెబుతున్నా సీఎం రేవంత్ ఇవేమి పట్టించుకోట్లేదు”అని కేటీఆర్ విమర్శించారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లను, గ్రామ సర్పంచ్ స్థానాలను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.