హైదరాబాద్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ల నుంచి ఈ నెల మూడో వారంలో అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన చర్యలు చేపట్టాలని సీఎస్‌కు సూచించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. పోడు రైతుల నుంచి వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా నవంబర్‌లో సర్వే ప్రారంభించాలని అధికారులకు ఆయన సూచించారు.
అప్లికేషన్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వాళ్లు సాగు చేస్తున్న భూమి వివరాలు పరిశీలించి నిర్ధారించుకోవాలని చెప్పారు. అటవీ భూముల సరిహద్దులను కో ఆర్డినేట్స్ ద్వారా గుర్తించాలన్నారు. గుర్తించిన భూముల రక్షణకు కందకాలు తవ్వడం, ఫెన్సింగ్ వేయడం తదితర పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకుంటూ ఫారెస్ట్ అధికారులు అటవీ భూముల రక్షణలో కీలకంగా పనిచేయాలని సీఎం అన్నారు. అడవులు రక్షించేందుకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని చెప్పారు. అటవీ పరిక్షణ కమిటీలు ఏర్పాటు చేసేందుకు విధివిధానాలు రూపొందించాలన్నారు. పోడు సమస్య పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అటవీ భూములు ఏ విధంగా అన్యాక్రాంతమయ్యాయో చూపిస్తామని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచే అటవీ అభూముల రక్షణ కోసం చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత అడవుల్లోకి అక్రమ చొరబాట్లు లేకుండా చూడటం ఫారెస్ట్ అధికారుల బాధ్యతేనని, అడవి తప్ప.. లోపల ఎవ్వరూ ఉండటానికి వీళ్లేదని ఆయన స్పష్టం చేశారు. అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అటవీ అంచున భూమిని కేటాయిస్తామన్నారు. అట్లా తరలించిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి, వ్యవసాయానికి నీటి సౌకర్యం, కరెంటు వంటి వసతులు కల్పించి.. రైతు బంధు, రైతు బీమాను కూడా వర్తింపచేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
