243 షాప్​లకు 10,980కి .. పైగా దరఖాస్తులు

243 షాప్​లకు 10,980కి .. పైగా దరఖాస్తులు

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు :  ఉమ్మడి మెదక్ జిల్లాలో వైన్స్ లైసెన్స్ లకు దరఖాస్తులు దండిగా దాఖలయ్యాయి. మొత్తం 243 షాప్​లకు 10,980కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో గతేడాది కంటే ఈ సారి దరఖాస్తులు బాగా పెరిగాయి. గిరాకీ ఎక్కువగా ఉండే కొన్ని షాప్ లకు 100కు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి.   సంగారెడ్డి జిల్లాలో 101 వైన్ షాపులు ఉండగా శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 5,150 దరఖాస్తులు అందాయి. ఇందులో మహిళల నుంచి 1,350 అప్లికేషన్లు వచ్చాయి. గిరాకీ ఎక్కువగా ఉండే పలు షాపులకు వందకు పైగా దరఖాస్తులు అందాయి.  

మెదక్ జిల్లాలోని 49 వైన్స్ షాప్ లు ఉండగా మొత్తం 1649 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. ఎస్సీకి రిజర్వు అయిన కొల్చారం మండలం పోతం శెట్టిపల్లి వైన్స్ కు అత్యధికంగా 104 దరఖాస్తులు అందాయి. సిద్దిపేట జిల్లాలోని 93 వైన్  షాప్  లకు దాదాపు మూడు వేల పై చిలుకు దరఖాస్తులు అందాయి. జిల్లాలో అత్యధికంగా ఆదాయాన్నిచ్చే 10 షాపులకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. కొండ పోచమ్మ ఆలయం వద్ద ఉన్న వైన్​షాపునకు రికార్డు స్థాయిలో 120 వరకు దరఖాస్తులు అందాయి. దరఖాస్తులను సాయంత్రం 6 గంటల వరకే తీసుకుంటామని చెప్పినా అధికారులు రాత్రి పొద్దు పొయ్యే వరకూ తీసుకుంటూనే ఉన్నారు.