
పోర్టల్‌లో లేని ట్రాకింగ్సిస్టమ్.. అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులు
పాస్బుక్కుల కోసం కొందరు.. వివాదాలపై మరికొందరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్ లో రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం చేసిన ఫిర్యాదులు, దరఖాస్తుల జాడ కనిపించడం లేదు. వారు మీసేవ కేంద్రాల ద్వారా పెట్టుకున్న దరఖాస్తుల పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదు. అసలు తమ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా అనే విషయం అర్థం కాక గందరగోళ పరిస్థితి నెలకొంది. తాము ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్ల గురించి స్థానిక తహసీల్దార్ ఆఫీసుల్లో బాధితులు ఎంక్వైరీ చేస్తే.. తమకు తెలియదని రెవెన్యూ ఉద్యోగులు చేతులెత్తుస్తున్నారు. తదుపరి ఏ సమాచారమైనా మీ సెల్ ఫోన్ కు మెస్సేజ్ రూపంలో వస్తుందని చెప్పి తిప్పి పంపుతున్నారు. ధరణి లో పెట్టుకున్న అప్లికేషన్లు ఏవీ కూడా నేరుగా తమ లాగిన్ కు రావని, నేరుగా కలెక్టర్లకే వెళ్తాయని, కలెక్టర్ నుంచి ఆర్డర్ వస్తేనే ఫైల్ పుటప్ చేస్తామని తహసీల్దార్లు సమాధానమిస్తున్నారు.
లక్షల్లో అప్లికేషన్లు..
ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ప్రారంభించాక ఏ అప్లికేషన్ నూ మాన్యువల్ గా తీసుకోవడం లేదు. ఏ చిన్న అంశమైనా ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందే.. ఇందులో ఆధార్ నంబర్ కరెక్షన్, ఆధార్ సీడింగ్, ఫొటో మిస్ మ్యాచ్, తండ్రి, భర్త పేరులో తప్పులు, సర్వే నంబర్ మిస్సింగ్, పెండింగ్ పాస్ బుక్స్, పెండింగ్ నాలా, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి తొలగింపు, సెమీ అర్బన్ ల్యాండ్స్ కు పాస్ బుక్స్ తదితర అప్లికేషన్లున్నాయి. ఇప్పటికే ఈ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు తహసీల్దార్, సర్వే ఏడీ, కలెక్టర్ల లాగిన్లలో లక్షల్లో ఉన్నాయి. మీ సేవ కేంద్రంలో దరఖాస్తు పూర్తి చేయగానే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తున్నప్పటికీ.. ఆ నంబర్ సాయంతో అప్లికేషన్ స్టాటస్ తెలుసుకునే మెకానిజం ధరణి పోర్టల్ లో లేదు. దీంతో తమ దరఖాస్తులు ఏ స్థాయిలో ఆగిపోయాయో బాధితులకు తెలియడం లేదు. ధరణి పోర్టల్ లో పెట్టుకున్న అప్లికేషన్ ను ట్రాక్ చేసేందుకు ఆప్షన్ ప్రవేశపెట్టాలని రెవెన్యూ అధికారులు, బాధిత రైతులు కోరుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామ రైతు కోల సోమయ్యకు భూ రికార్డుల ప్రక్షాళన టైమ్‌లో పట్టాదారు పాస్ బుక్ జనరేట్ అయింది. పాస్ బుక్ ఇంటికొస్తుందని తహసీల్దార్ చెప్పారు. కానీ, రెండేళ్లయినా రాలేదు. దీంతో ఫిబ్రవరి 19న మీ సేవ సెంటర్‌కి వెళ్లి ధరణి పోర్టల్ ద్వారా అప్లై చేశాడు. అయినా పాస్ బుక్ రాలేదు. అప్లికేషన్ స్టేటస్ ఏమిటో తెలుసుకునేందుకు తహసీల్దార్ ఆఫీసులో అడిగితే తమకు సంబంధం లేదన్నారు. దీంతో పాత అప్లికేషన్ పనికొస్తుందా.. లేదా తెలుస్తలేదని వాపోయాడు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ రావుల రంగారెడ్డికి 36 ఏండ్ల క్రితమే అసైన్డ్ చేసిన 2.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం ఇది ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్కు ఇచ్చిన ల్యాండ్ పదేళ్ల తర్వాత వారి సొంతమవుతుంది. అందువల్ల నిషేధిత జాబితా నుంచి తన భూమి వివరాలు తొలగించాలని అనేక సార్లు కలెక్టరేట్‌లో కోరాడు. ధరణి పోర్టల్‌లో ఆప్షన్ రావడంతో మార్చి 31న దరఖాస్తు చేశాడు. అప్లికేషన్ పెట్టి 2 నెలల దాటినా అతీగతి లేదు.