నాలుగు వారాల్లో భద్రతా కమిషన్‌‌ను నియమించండి

నాలుగు వారాల్లో భద్రతా కమిషన్‌‌ను నియమించండి

తెలంగాణ, ఏపీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీస్‌‌ కంప్లయింట్స్‌‌ అథారిటీల చైర్మన్, మెంబర్లను నియమించాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నియామకాలు పూర్తి చేసి రిపోర్ట్ అందజేయాలని స్పష్టం చేసింది.  ప్రకాశ్ సింగ్‌‌ కేసులో సుప్రీంకోర్టు 2017లో ఇచ్చిన తీర్పు ప్రకారం తెలుగు రాష్ట్రాలు కమిషన్‌‌/అథారిటీలను ఏర్పాటు చేయలేదని ఎన్‌‌ఎస్‌‌ చంద్రశేఖర శ్రీనివాసరావు రాసిన లెటర్ ను హైకోర్టు కంటెంప్ట్ పిటిషన్ గా పరిగణించి విచారణకు స్వీకరించింది. గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డిల బెంచ్ మరోసారి దీనిపై విచారణ చేపట్టింది. తెలంగాణ  ప్రభుత్వం తరపున ఏజీ ప్రసాద్ వాదిస్తూ..  కమిషన్‌‌కు చైర్మన్‌‌గా నియమించే సుప్రీంకోర్టు/హైకోర్టు రిటైర్డు జడ్జీలు, అథారిటీ చైర్మన్‌‌ పదవులకు రిటైర్డు జిల్లా జడ్జీల పేర్లను హైకోర్టుకు ప్రతిపాదించామని, ఆమోదం లభించగానే నియమిస్తామని చెప్పారు. స్పందించిన హైకోర్టు.. తమ నిర్ణయాన్ని వెల్లడించిన 4 వారాల్లోగా నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఏపీలో అథారిటీ, కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకాల కోసం 2020 నవంబర్‌‌లో జీవోలు జారీ అయ్యాయని, కరోనా వల్ల  జాప్యం అవుతోందని, 12 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది పి.గోవిందరెడ్డి బెంచ్ ను కోరారు. అంత టైమ్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ, ఏపీలు ముందున్నాయని, కరోనాను సాకుగా చూపి జాప్యం చేయవద్దని హితవు చెప్పింది.