ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించండి

ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించండి

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ ను కేబినెట్ కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఉద్ధవ్ థాక్రే కే సంబంధించిన నిర్ణయం కావటంతో కేబినెట్ భేటీకి ఆయన హాజరుకాలేదు. కరోనా ఎఫెక్ట్ కారణంగా మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఉద్ధవ్ థాక్రేకు కష్టం వచ్చి పడింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కావస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉద్ధవ్ ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ కానీ కాదు. దీంతో ఆరు నెలల్లో ఆయన ఏదో ఒక చట్ట సభకు ఎన్నిక కావల్సి ఉంది. లేదంటే సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందే. ఈ నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను శాసన మండలికి ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటంతో సర్కార్ కు దిక్కుతోచని స్థితి ఎదురైంది. దీంతో ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని గవర్నర్ ను కేబినెట్ కోరింది. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.