ఇంటర్‌లో మళ్లీ అప్రెంటిస్‌షిప్‍

ఇంటర్‌లో మళ్లీ అప్రెంటిస్‌షిప్‍

ఒకేషనల్‍ స్టూడెంట్స్‌కు బెనిఫిట్‍
ఏప్రిల్‍, మే నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు
హాస్పిటల్స్, కంపెనీల ప్రతినిధులతో బోర్డు చర్చలు

హైదరాబాద్‍, వెలుగు: నాలుగేండ్లుగా ఇంటర్మీడియట్‍ విద్యార్థులకు దూరమైన అంప్రెటిస్‌షిప్‍ విధానం తిరిగి ప్రారంభమవుతోంది. 2019–20 అకడమిక్‍ ఇయర్‍ నుంచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్​బోర్డు ఆఫీసర్‍ బి.జయప్రదబాయి తెలిపారు. ఒకేషనల్‍ కోర్సులు చదువుతున్న స్టూడెంట్స్‌కు ఈ విధానం ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. నాలుగేండ్ల క్రితం నేషనల్‍ అప్రెంటిస్‌షిప్‍ బోర్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో స్టూడెంట్సే సొంతంగా అప్రెంటిస్‍ అవకాశాలను పొందేందుకు కంపెనీల చుట్టూ తిరుగుతూ అవకాశాలు పొందుతున్నారు. ఈ ఏడాది నుంచి అప్రెంటిస్‌షిప్‍ అమలు బాధ్యతను మినిస్ట్రీ ఆఫ్‍ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్‍ ఎంటర్‍ప్రెన్యూర్‌కు కేంద్రం అప్పగించింది. ఇంటర్​బోర్డు అధికారులతో ఇటీవల ఆ శాఖ అధికారులు వర్క్ షాప్‍ నిర్వహించారు. ఈ అకడమిక్‍ ఇయర్‍ నుంచి అప్రెంటిస్‍ విధానాన్ని అమలు చేసేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే వర్క్ షాపులు
హాస్పిటల్స్‌లో మల్టీపర్పస్‍ హెల్త్ వర్కర్‍, ఫార్మా టెక్నాలజీ, ఫిజియోథెరపీ, మెడికల్‍ ల్యాబ్‍ టెక్నీషియన్‍ ఒకేషనల్‍ కోర్సులు చదివిన వారికి అప్రెంటిస్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అకౌంటింగ్ అండ్‍ టాక్సేషన్‍, అటోమొబైల్‍ ఇంజినీరింగ్‍ టెక్నీషియన్‍, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్‍, డీటీపీ అండ్‍ ప్రింటింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్‍ గార్మెంట్ మేకింగ్‍ తదితర కోర్సులు చేసిన వారికి సంబంధిత కంపెనీలలో అప్రెంటిస్‍ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై ఇప్పటికే ప్రముఖ హాస్పిటల్స్, కంపెనీల మేనేజ్‌మెంట్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఏప్రిల్‍, మేలో ఒకేషనల్‍ కోర్సులు పూర్తి చేసిన స్టూడెంట్స్‌కు అప్రెంటిస్‌షిప్‍ కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఒకేషనల్‍ కోర్సులు పూర్తి కాగానే స్టూడెంట్స్ అప్రెంటిస్‌లో భాగంగా జాబ్‍లు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అప్రెంటిస్‌షిప్‍ వల్ల అదనపు నైపుణ్యం పెరిగి ఉన్నత ఉద్యోగావకాశాలు పొందే వీలు ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో వర్క్ షాపులు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

రూ.7 వేలు స్టైఫండ్‍
ఇంటర్​పూర్తి చేసిన స్టూడెంట్స్ కోర్సును బట్టి కంపెనీలు, హాస్పిటల్స్‌లో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టూడెంట్స్‌కు స్టైఫండ్‍ కింద రూ.7 వేలు అందజేస్తారు. నాలుగేండ్ల క్రితం నేషనల్ అప్రెంటిస్‌షిప్‍ బోర్డు ఈ వ్యవహారాలను పర్యవేక్షించేది. కానీ ఈ బోర్డును రద్దు చేయడంతో అప్పటి నుంచి అప్రెంటిస్‌‌షిప్‍కు స్టూడెంట్స్ దూరం అయ్యారు. జిల్లా పరిధిలో మొత్తం 309 ఇంటర్‍ కాలేజీలున్నాయి. వాటిల్లో 264 ప్రైవేట్‍వి కాగా, మిగతావి గవర్నమెంట్‍, ఎయిడెడ్, వెల్ఫేర్‍ కాలేజీలు. వీటిల్లో సుమారు 12,356 మంది ఫస్టియర్‍, 9,827 సెకండియర్‍ స్టూడెంట్స్ ఒకేషనల్‍ కోర్సులు చదువుతున్నారు. అప్రెంటిస్‌షిప్‍ విధానం అమలుతో లబ్ధి పొందనున్నారు.