ఫ్లైఓవర్ పై అదుపుతప్పి రెయిలింగ్ ను గుద్ది ఆగిన ఆర్టీసీ బస్సు

ఫ్లైఓవర్ పై అదుపుతప్పి రెయిలింగ్ ను గుద్ది ఆగిన ఆర్టీసీ బస్సు
  • డోన్ పాతబస్టాండులో తృటిలో తప్పిన ఘోర  ప్రమాదం

కర్నూలు: డోన్ పట్టణం లోని పాతబస్టాండు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అనంతపురం నుండి కర్నూలు కి వెళ్తోంది. డోన్ ఆర్టీసీ బస్టాండు నుంచి బయటకు పాతబస్టాండు ప్లైఓవర్ పైకి రాగానే కారు ఎదురుగా రావడంతో తప్పించబోయి ఫ్లైఓవర్ రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగిపోయింది.
వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడెన్ గా టర్న్ తీసుకుని రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగిపోవడం కలకలం రేపింది. రెప్పపాటులో జరిగిపోయిందీ ఘటన. అయితే రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగిపోవడంతో ఫ్లై ఓవర్ కింద ఉన్న వారిపై రెయిలింగ్ పెచ్చులు పడ్డాయి. ముగ్గురు విద్యార్థులు రెయిలింగ్ పెచ్చులు పడి గాయపడ్డారు. బస్సు ఫ్లై ఓవర్ నుంచి కిందపడి ఉంటే ఘోర ప్రాణనష్టం జరిగి ఉండేది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ఉన్నారు. ఎవరికీ  ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డోన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.