ఆర్డిన‌రీ బ‌స్సుల‌కూ ఆన్ లైన్ బుకింగ్.. 21 నుంచి ఏపీలో ఆర్టీసీ బ‌స్సులు స్టార్ట్

ఆర్డిన‌రీ బ‌స్సుల‌కూ ఆన్ లైన్ బుకింగ్.. 21 నుంచి ఏపీలో ఆర్టీసీ బ‌స్సులు స్టార్ట్

దాదాపు రెండు నెల‌లుగా డిపోల‌కే ప‌రిమిత‌మైన ఆర్టీసీ బ‌స్సులు రోడెక్క‌బోతున్నాయి. మే 21 నుంచి బ‌స్సులు న‌డ‌పాల‌ని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణ‌యించింది. సోష‌ల్ డిస్టెన్స్ పాటిస్తూ ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే ప్ర‌యాణికులను అనుమ‌తిస్తూ బ‌స్సుల‌ను తిప్ప‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. క‌రోనా లాక్ డౌన్ ను మే 18 నుంచి 31 వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం.. దాదాపు అన్ని రంగాల‌కు స‌డ‌లింపులు ఇచ్చింది. ప్ర‌జా ర‌వాణాను పున‌రుద్దరించే విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స్వేచ్ఛనిచ్చింది. దీంతో తెలంగాణ‌లో మంగ‌ళ‌వారం (మే 19) నుంచే బ‌స్సులు స్టార్ట్ చేసింది కేసీఆర్ స‌ర్కార్. అయితే ఏపీలో రెండు రోజుల ఆల‌స్యంగా 21 నుంచి బ‌స్సులు తిప్పేందుకు నిర్ణ‌యం తీసుకుంది ఏపీ ప్ర‌భుత్వం. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డంతో పాటు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అంతా మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఉత్త‌ర్వులు జారీ చేసింది. దూర ప్రాంతాల‌కు వెళ్లే బ‌స్సుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ప్రారంభించింది ఆర్టీసీ. అయితే ఆర్డిన‌రీ బ‌స్సుల్లో ప్రయాణం చేయాల‌న్న స‌రే ముందుగా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్న వారికే ఏపీఎస్‌ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.