ఏసీబీ వలలో ఏఆర్ డీఎస్పీ, ఎస్ఐ

ఏసీబీ వలలో ఏఆర్ డీఎస్పీ, ఎస్ఐ

వికారాబాద్: యాభై వేల  రూపాయల లంచం తీసుకుంటూ ఏఆర్ డీఎస్పీ, ఎస్ఐ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని ఏఆర్  డిపార్ట్ మెంట్ లో సత్యనారాయణ డీఎస్పీగా, ప్రేమ్ సింగ్ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఆఫీస్ లో కాంట్రాక్ట్ విధానంలో ప్లంబర్ గా చేస్తున్న ఓ వ్యక్తి నుంచి జాబ్ పర్మనెంట్ చేస్తామంటూ రూ.50 వేలు డిమాండ్ చేశారు.  అయితే తన వద్ద అంత డబ్బు లేదని, జాబ్ పర్మనెంట్ చేయాలని బాధితుడు వాళ్లను వేడుకున్నాడు. కానీ అవేమీ పట్టించుకోని అధికారులు రూ.50 వేలు ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగం పీకేస్తామని హెచ్చరించారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని బాధితుడు... అప్పు చేసి మరి రూ.35 వేలు అధికారులకు అప్పజెప్పాడు. అయితే ఇంకా 15,000 ఇవ్వాలని అధికారులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారి సూర్యనారాయణ బృందం.. వల పన్ని అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం ఏసీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.