అరకులోయ అంతా చిమ్మచీకటి.. ఏడ్పులు.. ఆర్తనాదాలు

అరకులోయ అంతా చిమ్మచీకటి.. ఏడ్పులు.. ఆర్తనాదాలు

విశాఖపట్టణం: అంతా చిమ్మ చీకటి.. దీనికి తోడు చలి వాతావరణం. లోయలో పడిపోయిన వారి కోసం మొబైల్ ఫోన్ల వెళుతురులో.. పోలీసుల ఫోకస్ లైట్లు.. టార్చిలైట్లతో వెదుకులాటలతో అరకు లోయ మరుభూమిలా మారిపోయింది. తీవ్ర రక్తస్రావంతో మూలుగులు.. ఏడ్పులు.. కొంత మంది పెడబొబ్బలు పెడుతుంటే సహాయక చర్యలు ఒళ్లు గగుర్పాటు కలిగించాయి. పోలీసులకు తోడు స్థానికులు, దారినపోయే వారు కూడా తమ వాహనాలు నిలిపేసి సహాయక చర్యల్లో పాల్గొనడంతో గాయపడిన వారిని అంబులెన్స్ లో తరలించడం.. మరికొంత మంది చిన్నపాటి గాయాలతో.. కాళ్లు చేతులు విరిగి.. నొప్పి.. బాధతో విలవిలలాడుతున్న దృశ్యాలతో అరకు లోయలో బీభత్సమైన పరిస్థితి. ఇంకా ఎవరైనా ఉన్నారా.. లోపలకు పడిపోయారా అన్నది తెలుసుకునేందుకు.. గాయపడిన వారిని పైకి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు ఎంతటివారినైనా కంటతడిపెట్టిస్తున్నాయి. గాయపడిన వారి రోదనలు వింటున్న వారు కూడా గుండె బరువెక్కి వెక్కి వెక్కి విలపిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రమాదంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అరకు లోయలో పడిపోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. హైదరాబాద్ షేక్ పేట ప్రాంతానికి చెందిన వారు ఇవాళ ఉదయమే విశాఖపట్టణం వచ్చి అరకు లోయ విహార యాత్ర చేస్తుండగా ప్రమాదానికి గురికావడం.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అధికార వర్గాలతోపాటు నేతల్లోనూ కలవరం కలిగించింది. ఒకవైపు ప్రమాద స్థలి అంతా మరుభూమిని మరిపిస్తుంటే.. నేతల ఆరాలతో అందరి దృష్టి అరకుపైనే కేంద్రీకృతమైంది. అంతా చీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు వస్తున్న వార్తలు అయ్యో పాపం.. అనే నిట్టూర్పులతో జనం అంతా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఆరాతీశారు. చీకట్లో గాయపడినవారి ఆర్తనాదాల గురించి వింటూ నిట్టూర్పులు విడవడంతో విషాదవాతావరణం ఏర్పడింది.

బస్సు ప్రమాదంపై సీఎం  వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి
విశాఖ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో డముకు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాద ఘటనపై సీఎంఓ అధికారులతో ఆరా తీశారు. జరుగుతున్న సహాయక చర్యల వివరాలను అడిగితెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు సీఎం జగన్.

అరకు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి

విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని డుముకు ఘాట్ రోడ్డులో ఈరోజు జరిగిన బస్ ప్రమాదంలో ఎనిమిది పర్యాటకులు మృతి  చెందిన దుర్ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే  మెరుగైన చికిత్సను అందించవలసినదిగా సంబంధిత అధికారులను కోరారు  గవర్నర్ హరి చందన్.

ప్రమాదం విషాదకరం-జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదం దిగ్భ్రాంతికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డులో డముకు దగ్గర చోటు చేసుకున్న ప్రమాద ఘటన గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి అరకు పర్యటనకు వెళ్ళినవారు తిరుగు ప్రయాణంలో ప్రమాదం పాలవడం విషాదకరం. 30 మందితో ఉన్న బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృత్యువాత పడ్డారని తెలిసింది. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులైన పర్యాటకులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమన్వయం చేసుకొని మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.