58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్.. అన్న సల్మాన్ ఖాన్ మాత్రం ఇలా..?

58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్.. అన్న సల్మాన్ ఖాన్ మాత్రం ఇలా..?

నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా వారి పెళ్లి, పిల్లల విషయాల గురించి అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ , ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్. వీరిద్దరి జీవితాల్లో జరిగిన రెండు విభిన్న సంఘటనలు ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అన్న పెళ్లి మాటే ఎత్తకుండా 'శాశ్వత బ్రహ్మచారి'గా ఉంటానంటున్నారు. కానీ పిల్లలను కంటానంటారు. తమ్ముడు మాత్రం 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

రెండోసారి తండ్రైన అర్బాజ్ ఖాన్ .. 

బాలీవుడ్‌లో వివాదాలు, వదంతులకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అర్బాజ్ ఖాన్ జీవితంలోకి కొత్త ఆనందం వచ్చింది. గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకుని, 2017లో విడాకులు తీసుకున్న అర్బాజ్‌కు అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్‌లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందారు.

ఈ రోజు (అక్టోబర్‌ 5న) ముంబైలోని ఒక ఆస్పత్రిలో షురా ఖాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. ఈ శుభవార్త వినగానే సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్ నుండి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. సోదరుడి కుటుంబానికి కొత్తగా వచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి సల్మాన్ ఆతృతగా వెళ్లడం వారి కుటుంబ బంధాన్ని తెలియజేస్తుంది.  ఇక అర్బాజ్ ఖాన్ 'దబాంగ్', 'ప్యార్ కియా తో డర్నా క్యా' వంటి హిందీ సినిమాలలో నటించడమే కాక, తెలుగులో 'జై చిరంజీవ'లో విలన్‌గా మెప్పించారు.

పిల్లలను కంటా​​​ సల్మాన్ బోల్డ్ కామెంట్స్

 ఒకవైపు తమ్ముడు అర్బాజ్ రెండోసారి తండ్రిగా మారితే, మరోవైపు అన్న సల్మాన్ ఖాన్  ఇటీవల వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. డిసెంబర్‌తో 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సల్మాన్, ఇటీవల కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహించిన 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు, తనను తాను గతంలో 'శాశ్వత బ్రహ్మచారి'గా ప్రకటించుకున్న సల్మాన్, ఈసారి పిల్లల విషయంలో బోల్డ్ కామెంట్స్ చేశారు.

 ట్వింకిల్ ఖన్నా  పిల్ల దత్తత గురించి సూటిగా అడగగా, సల్మాన్ 'లేదు' అని సమాధానం చెప్పారు. నాకు తప్పకుండా పిల్లలు పుడతారు. త్వరలోనే...అని ఆయన నమ్మకంగా చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది. పెళ్లి గురించి ప్రస్తావించకుండా, పిల్లలను కంటానని చెప్పడం వెనుక, సల్మాన్ సరోగసీ పద్ధతిని ఎంచుకోవచ్చనే ఊహాగానాలు బాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్లు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు.  వారికి పెళ్లైంది. కానీ ఇప్పుడు సల్మాన్ కూడా అదే మార్గాన్ని అనుసరించనున్నట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మొత్తంగా, అన్నదమ్ములు ఇద్దరూ తమ జీవితాల్లో భిన్నమైన, కానీ ఆనందకరమైన ఘట్టాలను పంచుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన కొత్త నిర్ణయం గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో, బాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..