సూర్యాపేట దవాఖానాలో జాబ్స్​ అమ్ముకున్నరు

సూర్యాపేట దవాఖానాలో జాబ్స్​ అమ్ముకున్నరు
  • ఓ లీడర్​ రిలేటివ్​కు రిక్రూటింగ్​ ఏజెన్సీ బాధ్యతలు  
  • తాజాగా 38 ఉద్యోగాలకూ నో నోటిఫికేషన్​
  • ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షలు వసూళ్లు 

సూర్యాపేట వెలుగు:  సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎలాంటి నోటిఫికేషన్​లేకుండానే భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ముఖ్య లీడర్ ​రిలేటివ్​కు రిక్రూట్​మెంట్​ ఏజెన్సీ అప్పగించడంతో డబ్బులు తీసుకుని జాబ్స్​ ఇస్తున్నారన్న విమర్శలున్నాయి.  
38పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ 
ఇటీవల స్టేట్​గవర్నమెంట్​దవాఖానాలో 38 పోస్టులను ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో భర్తీ చేసుకునేందుకు జీఓ ఇచ్చింది. ఇందులో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, హెల్పర్ వంటి పోస్టులున్నాయి. అయితే వీటికి నోటిఫికేషన్​ ఇచ్చి అప్లికేషన్లు తీసుకుని, తర్వాత అందులో అర్హులను సెలెక్ట్ చేసుకోవాల్సి  ఉండగా, అందరి దగ్గర డబ్బులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా రిక్రూట్​ చేసుకున్నట్టు తెలిసింది.  
పోస్టుకు రూ.2 నుంచి రూ.3 లక్షలు 
 38  పోస్టుల్లో ఒక్కో పోస్టుకు రూ.2లక్షల నుంచి3లక్షల తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అటెండర్ పోస్టుకు రూ.లక్షన్నర, హెల్పర్ పోస్టుకు రూ.లక్ష, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు రూ.2లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. గతంలో మెడికల్ కాలేజ్ రిక్రూట్​మెంట్​ కూడా ఇదే ఏజెన్సీకి ఇవ్వగా, కొంతమంది ఆఫీసర్లు సదరు లీడర్​కు కరెక్ట్​ కాదని చెప్పడంతో నియామకాలు రద్దు చేశారు.   
ఎంప్లాయ్​మెంట్ ఎక్స్ఛేంజీ  దగ్గర నో డాటా
డీ‌ఎం‌హెచ్‌ఓ ఆఫీస్, మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్స్​లో ఉద్యోగాల భర్తీని ఎంప్లాయ్​మెంట్ ఎక్స్ఛేంజీ ఆధ్వర్యంలో చేపట్టాల్సి ఉండగా ఇష్టమున్నట్టు రిక్రూట్​ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మెడికల్ డిపార్ట్​మెంట్​లో ఎన్ని ఏజెన్సీల ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారన్న దానిపై ఎంప్లాయ్​మెంట్ ఎక్స్ఛేంజీ ఆఫీసర్ల వద్ద కనీస సమాచారం లేదు. 
గతంలోనూ ఇదే పని.. 
కొవిడ్​ టైంలోనూ ఎమర్జెన్సీ కింద ఉద్యోగులను తీసుకోగా హాస్పిటల్ లోని కొంత మంది ఉద్యోగులు ఒక్కో జాబ్​కు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు వసూళ్లు చేశారు. సంవత్సరం తర్వాత వారిని తొలగించడంతో గొడవ చేశారు. సూపరింటెండ్​ తిరిగి డబ్బులు ఇప్పిస్తామని  హామీ ఇచ్చారు. కానీ, సదరు ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటితో పాటు హాస్పిటల్ లో ఒకే ఊరికి చెందిన వారికి ఉద్యోగాలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు. ఇప్పటికైనా అర్హులకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.