7 లక్షల సంవత్సరాల క్రితమే వండుకొని తిన్నరు!

7 లక్షల సంవత్సరాల క్రితమే వండుకొని తిన్నరు!

‘ఇప్పుడంటే నచ్చిన ఫుడ్ ని ఫ్రై, రోస్ట్, స్టీమ్, తందూరి, కబాబ్ చేసుకొని తింటున్నాం. కానీ, కోట్ల సంవత్సరాల క్రితం ఆదిమానవులు పచ్చి కూరగాయలు, మాంసం తినేవాళ్లు’ అనుకుంటారు చాలామంది. అయితే, ఆదిమానవులు సివిలైజేషన్ ఎప్పటినుంచి మొదలుపెట్టారు, ఏ కాలంలో ఆహారాన్ని వండటం ప్రారంభించారు అన్న ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం దొరకలేదు. ఇదివరకు వచ్చిన సర్వేలో 1,70,000 సంవత్సరాల క్రితం ఆదిమానవులు మొదటిసారి ఉడికించి తిన్నారని చెప్పినా కచ్చితమైన ఆధారాలతో రుజువు చేయలేకపోయారు. తాజాగా ఇజ్రాయిల్ లోని  టెల్ అవీవ్ యూనివర్సిటీ పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో సుమారు 7,80,000 సంవత్సరాలకు ముందునుంచే ఆదిమానవులు ఆహారాన్ని వండుకొని తిన్నారని రుజువు చేశారు.

ఉత్తర ఇజ్రాయిల్ లోని గెషర్ బెనోట్ యాకోవ్ లో దొరికిన చేపల అవశేషాలపై చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఇజ్రాయిల్ జోర్డాన్ నది ఒడ్డున చేపల పురాతన శిలాజాలు దొరికాయి. అవి 7లక్షల సంవత్సరాల క్రితం శిలాజాలుగా గుర్తించారు. దాదాపు రెండు మీటర్ల పొడవున్న ఈ మంచి నీటి చేపల శిలాజాలకు కేవలం పళ్లు మాత్రమే ఉన్నాయి. వాటి పక్కనే ఉన్న బొగ్గుల పొయ్యి దగ్గర ఎముకలు దొరికాయి. అక్కడే చేపల్ని వండినట్టు తెలుస్తుంది. ఆ చేపల పళ్లలోని ఎనామెల్ ను లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్స్ రే పౌడర్ తో డిఫ్రాక్షన్ చేశారు. ఆ టెస్ట్ లో ఎముకల్ని 200 నుంచి 300 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడిచేసినట్టు తెలిసింది. దీంతో 7 లక్షల సంవత్సరాల క్రితమే ఆదిమానవులు ఆహారాన్ని వండుకొని తిన్నారని స్పష్టం చేశారు.