జూన్ 22 నుంచి రవీంద్రభారతిలో ‘అర్ధనారీశ్వరం’

జూన్ 22 నుంచి రవీంద్రభారతిలో ‘అర్ధనారీశ్వరం’

రవీంద్రభారతి, వెలుగు: ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నృత్యోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల తెలిపారు. ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటల నుంచి అర్ధనారీశ్వరం పేరిట నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ, సీనియర్ కళాకారులు పాల్గొంటారని చెప్పారు. 

శనివారం కళాభవన్ లో జరిగిన సమావేశంలో సంబంధిత పోస్టర్​ను రిలీజ్​చేశారు. సోమవారం సాయంత్రం వేడుకలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.  కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలను సత్కరించనున్నట్లు తెలిపారు. నృత్యోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. మూడు రోజుల ప్రదర్శనలపై విద్యార్థులకు సమీక్ష, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేస్తామని చెప్పారు.