దళిత బంధు పైసలునీ ఇంట్లకెల్లి ఇస్తున్నవా?

దళిత బంధు పైసలునీ ఇంట్లకెల్లి ఇస్తున్నవా?

సీఎం కేసీఆర్‌‌పై పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌రెడ్డి ఫైర్‌‌
హైదరాబాద్, వెలుగు: పులికి మేకను ఎరేసినట్లు హుజూరాబాద్ బై ఎలక్షన్‌‌లో గెలిచేందుకు దళిత బంధును సీఎం కేసీఆర్‌‌ తెచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి అన్నారు. 10 లక్షలు కేసీఆర్ బిచ్చం వేస్తలేరని.. దళితులు, గిరిజనులు, మహిళలు పన్ను రూపంలో కట్టే రూ. 2 లక్షల కోట్ల నుంచే ఇస్తున్నారని అన్నారు. ‘మా తాతల భూములను లాక్కొని వేల కోట్లకు తెగనమ్మి 10 లక్షలు ఇస్తానంటున్నవ్. నీ ఫాం హౌస్‌‌లో ఇంచు కూడా ఇస్తలేవు. దళిత బంధు మా హక్కు’ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ సభలో రేవంత్‌‌ మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో కలుగు లోంచి వచ్చిన నక్కజిత్తుల కేసీఆర్‌‌ను ఒక్క పోటు పొడవాలని పిలుపునిచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నపుడు ఆయన కాళ్ల మీద పడ్డ కేసీఆర్.. రామ్‌‌నాథ్ కోవింద్ కాళ్లెందుకు మొక్కలేదని ప్రశ్నించారు. చదువుకుంటే ప్రశ్నిస్తారని, ఉద్యోగం ఇస్తే హక్కులు అడుగుతారని సీఎం కేసీఆర్ అవకాశాలు రాకుండా చేస్తున్నరన్నారు. తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం అడుగుతున్నారని, సీఎం మోచేతి నీళ్లు కాదన్నారు. దళితబంధు పేరుతో కేసీఆర్ చేస్తున్న మోసాన్ని హుజూరాబాద్ ప్రజలు గమనించి ఆయన గుండెల మీద గుద్దాలని పిలుపునిచ్చారు. తండ్రికి తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చానంటున్న మంత్రి కేటీఆర్‌‌కు బుద్ధి ఉందా అని  ప్రశ్నించారు. మహేందర్‌‌రెడ్డిని నట్టేట ముంచి కేసీఆర్‌‌ తన కొడుక్కు టికెట్‌‌ ఇచ్చి తెలుగుదేశం వాళ్ల కాళ్లు పట్టుకొని గెలిపించారన్నారు. 
రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు: సీతక్క
కాంగ్రెస్ నుంచి దళితులను దూరం చేసేందుకు సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ 2014లో చెప్పారని, ఇప్పుడు దళిత బంధు పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమే పథకాలు ప్రకటిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోనే గిరిజనుల నుంచి 15 వందల ఎకరాలు సీఎం కేసీఆర్ గుంజుకున్నారని ఏఐసీసీ ఆదివాసీ వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఎస్టీలకు ఇచ్చిన ఈ భూములను గుంజుకొని కోటి రూపాయలకు ఎకరం చొప్పున అమ్ముకుంటున్నారన్నారు. దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసే దమ్ము సీఎం కేసీఆర్‌‌కు ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణలో కొందరు నాలుక లేని మంత్రులు ఉంటే మరికొందరు కబ్జాకోరులున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు.