మన కోచింగ్ సెంటర్లు ​సేఫేనా?

మన కోచింగ్ సెంటర్లు ​సేఫేనా?
  • సందుగొందుల్లో వందల సెంటర్ల నిర్వహణ
  • రూల్స్‌‌ పాటించని సిటీ ఇనిస్టిట్యూట్లు 
  • కనిపించని ఫైర్​సేఫ్టీ పరికరాలు
  • అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గమే లేదు
  • సెల్లార్లలోనూ కుర్చీలేసి క్లాసులు

సూరత్​లోని ఓ కోచింగ్​ సెంటర్ ​కాంప్లెక్స్​లో ఫైర్‌‌‌‌ సేఫ్టీ లేకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగి 20 మంది స్టూడెంట్స్‌‌ చనిపోయారు. ఉన్నది ఒకే దారి కావడంతో ఫైరింజన్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగి మృతుల సంఖ్య పెరిగింది. ఇలాంటి ఘటనే నగరంలోని కోచింగ్​సెంటర్లలో జరిగితే పరిస్థితేంటి? ఇక్కడ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. సిటీలోని అమీర్‌‌పేట, దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌, అశోక్‌‌నగర్‌‌ లాంటి ప్రాంతాల్లోని సందుల్లో కోచింగ్​సెంటర్లున్నాయి. ఇరుకు గదుల్లో పరిమితికి మించిన స్టూడెంట్స్‌‌‌‌‌తో ఫైర్​సేఫ్టీ లేకుండా  క్లాసులు చెబుతున్నారు. కొన్నిచోట్ల సెల్లార్లలోనూ కుర్చీలేసి తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారులు కూడా ఏదైనా పెద్ద ఘటన జరిగినప్పుడే తనిఖీలంటూ హడావుడి చేసి తరువాత సైలెంట్‌‌ అయిపోతున్నారు. రూల్స్ ​పాటించకుండా నడుపుతున్న కోచింగ్​సెంటర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ‑ హైదరాబాద్​, వెలుగు

ఒక్కసారి అమీర్​పేట కి వెళ్లండి. ‌‌‌‌‌‌‌‌ఎన్నో కోచింగ్ సెంటర్లు అక్కడ కనిపిస్తాయి. బీటెక్ లేదా సాధారణ డిగ్రీ పూర్తి చేసినోళ్లకు ఫస్ట్​ గుర్తొచ్చేది  అదే. ఇంకా ఏదైనా కంప్యూటర్​ కోర్సు నేర్చుకోవడమో, ఉన్న దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అమీర్ పేటలోని కోచింగ్ సెంటర్లకు  క్యూ కట్టే స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఇరుకైన సందుల్లో వందల కోచింగ్​ సెంటర్లు ఉన్నాయి. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం ఏదైనా జరిగినా తప్పించుకోలేనంతగా ఉన్నాయి ఆ కోచింగ్ సెంటర్ల నిర్మాణాలు. సిటీలోని దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, అశోక్ నగర్ వంటి చాలా ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్, వెలుగు: నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగాల వేటలో శిక్షణ పొందేందుకు  రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఉద్యోగార్థులు హైదరాబాద్ లోని అనేక రకాల కోచింగ్ సెంటర్లలో చేరుతుంటారు. ఈ తరుణంలో రాజధానిలోని పలు కోచింగ్ సెంటర్లు కేవలం ఫీజులు పై దృష్టి ఉంచుతూ సరైన ప్రమాణాలు పాటించక ఇరుకు గదుల్లో, ఫంక్షన్ హాల్స్ లో, మరికొన్ని పేరొందిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చర్చీల సెల్లార్ లలోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏదైనా అనుకోని సంఘటన జరిగి అగ్ని ప్రమాదం జరిగితే కనీసం విద్యార్థులు బయటకు పరుగెత్తి బయట పడేందుకు కూడా సరైన సౌకర్యాలు లేని ఎన్నో కోచింగ్ సెంటర్ మన సిటీలో ఉన్నాయి.  బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ కోర్సులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిటీలోని అమీర్ పేట మొదలు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, దిల్ సుఖ్ నగర్ ఏరియాలలో దాదాపు లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు నిత్యం ఏదో ఒక కోచింగ్ లో, ప్రిపరేషన్ లో నిమగ్నమై ఉంటారు. క్లాసులకు వెళ్ళేటప్పుడు వారి ఆలోచనను కేవలం చదువుపై మాత్రమే ఉంటుంది కానీ చదువుకంటే ముఖ్యమైన వారి భద్రతకు ఉన్న ప్రమాదాన్ని వారు ఊహించలేరు. ఇటువంటి సందర్భాల్లో హాల్లలో, క్లాస్ రూమ్స్ లో  హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితే  ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది.

ఒకటే మెట్ల దారి

దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, అశోక్ నగర్, చిక్కడపల్లి  లోని చాలా కోచింగ్​ సెంటర్లలో దాదాపు చాలా వాటికి  ఒకటే మెట్ల దారి ఉంది. అవి కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడే పరికరాలు లేవు. కొన్ని కోచింగ్​ సెంటర్లలో ఫైర్​ ఎగ్జిట్ ఉన్నా వాటికి తాళం పెట్టేశారు. వాడకంలో లేకుండా చేశారు. క్లాసుల్లో పరిమితికి మించి స్టూడెంట్లను కూర్చోబెడుతున్నారు. కొన్ని కోచింగ్​ సెంటర్లలో అయితే, చిన్న క్లాసు రూముల్లోనే వంద మంది వరకు కుక్కేస్తున్నారు. పోనీ సరైనా వెంటిలేషన్​ ఉందా అంటే అదీ లేదు. క్లాసు రూముల సామర్థ్యానికి మించి రెట్టింపుగా స్టూడెంట్స్ ను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు.

సూరత్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం లాంటిది మరొకటి జరగదని చెప్పలేం.  హైదరాబాదులో అందుకు ఆస్కారమిచ్చే ఎన్నో కోచింగ్ సెంటర్ల క్లాస్ రూమ్స్  ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి. ప్రభుత్వం, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రమాదం జరిగిన తరువాత స్పందిస్తారే తప్ప ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు.  సిటీలో  50 మీటర్లలోపు బిల్డింగ్ లకు జీహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇస్తారు. అంతకు మించిన బిల్డింగ్ లకు ఫైర్ డిపార్ట్ మెంట్ అనుమతులు తప్పనిసరి. కానీ రూల్స్ పాటించకుండా ఇన్ని బిల్డింగ్ లు ఎలా ఉన్నాయన్నది ప్రశ్నార్థకం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉద్యోగం సాధించాలని చెప్పి ఎన్నో ఆశలతో హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్లలోకి పంపిస్తున్నారు. వారి లక్ష్య సాధనలో భాగంగా విద్యార్థులు కోచింగ్ సెంటర్ లలో చేరుతున్నారు.కానీ సిటీ లోని కోచింగ్ సెంటర్లలో ఏ ఒక్క చోట కూడా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలు లేవు. పైగా తరగతులు నిర్వహిస్తున్న భవనాలు అత్యంత ఇరుకుగా తప్పించుకోడానికి నిరోధంగా ఉన్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మందిని కూర్చోబెట్టి తరగతులు నిర్వహించడం మరింత ప్రమాదకరంగా మారింది.

ఫీజులెక్కువ.. సౌకర్యాలు తక్కువ

చిన్న కోచింగ్ సెంటర్ కదా ఫీజు తక్కువగా వసూలు చేస్తారనుకుంటే పొరపాటే. స్థాయిని బట్టి సగటున రూ.15వేల వరకు వసూలు చేస్తున్నారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు. మళ్లీ అందులోనూ నెలల వారీగా తేడాలూ ఉన్నాయి. అంత ఫీజు వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదు. ఫైర్​ సేఫ్టీ పరికరాల్లేకపోయినా కంప్యూటర్లు, ఏసీ, కూలర్​, ఫ్రిజ్​ వంటి కరెంట్​ పరికరాలను ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. వాటికీ సరైన సేఫ్టీ పాటించడం లేదు. కంప్యూటర్​ వైర్లను ఎట్లపడితే అట్ల వదిలేస్తున్నారు. కుప్పలు తెప్పలుగా నేలమీద నుంచే కనెక్ట్​ చేస్తున్నారు. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

పార్కింగ్ ప్లేస్ లోనూ క్లాసులు

మామూలుగా అయితే బిల్డింగ్​సెల్లార్​లో కార్లు, బైకులు పార్క్​ చేస్తారు. కొన్ని సెంటర్లు మాత్రం ఆ కార్లు, బైకుల పక్కనే చైర్లు వేసి ఎంచక్కా క్లాసులు చెప్పించేస్తున్నాయి. ఫైర్​ సేఫ్టీ నిబంధనల ప్రకారం సెల్లార్​ను ఇలా వాడుకోకూడదు. అది చాలా పెద్ద నేరం. వెహికల్స్ పార్కింగ్​తో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేలా మరో దారి కూడా ఉండాలి. ఈ  రూల్ ను చాలా మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు బ్రేక్ చేస్తున్నారు. కనీసం వాటిని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే అమీర్​పేటకు కోచింగ్ సెంటర్ల అడ్డాగా పేరుపడింది. దీంతో అక్కడ కోచింగ్ సెంటర్లలో ఫీజులు రూపంలో స్టూడెంట్స్ దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్న నిర్వాహకులు..సమ్మర్ లో కనీసం ఫైర్ సేఫ్టీ రూల్స్ ని పాటించడం లేదు. సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదని కొందరు స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.