- అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి అరెస్టు చేయడమేంటి?: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: పాలన చేతగాని కాంగ్రెస్ సర్కారు.. పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఈ రాజకీయ వికృత క్రీడలో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా అని ప్రశ్నించారు. మంత్రి, మహిళా ఐఏఎస్‌పై కథనాల నేపథ్యంలో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన ఘటనపై బుధవారం ఆయన ఒక ప్రటకనలో స్పందించారు. ఇండ్లల్లోకి చొరబడి అర్ధరాత్రి సమయంలో అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా.. అని నిలదీశారు.
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడేనని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, జర్నలిస్టుల అరెస్టుపై హరీశ్ రావు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి ఇండ్లకు వెళ్లి అరెస్ట్ చేయడం అవసరమా అని ఆయనను ప్రశ్నించారు. ప్రొసీజర్ అనుసరించకుండా, నోటీసులివ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారన్నారు.
