మత విద్వేషాలు రెచ్చగొట్టిన చల్లాపై కేసులుండవా?

మత విద్వేషాలు రెచ్చగొట్టిన చల్లాపై కేసులుండవా?
  • అయోధ్య రాముడి గుడికి జనం స్వచ్ఛందంగా చందాలు ఇస్తుంటే టీఆర్ ఎస్ తట్టు కోలేకపోతోంది
  • ప్రశ్నించే వాళ్లం దరినీ జైల్లో పెట్టాలంటే జైళ్లు సరిపోవు: బీజేపీ
  • ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ లీడర్లకు బెయిల్.. విడుదల
  • వరంగల్ లో భారీ ర్యాలీ

వరంగల్, వెలుగు: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ‘‘రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన్రు.. ఇదేమని అడిగినపాపానికి మాపై అక్రమ కేసులు పెట్టిన్రు.. ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత నిర్బంధం లేదు’ అని ఎమ్మెల్సీ రాంచందర్​రావు, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు తదితరులు అన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ నేతలను అణచివేసేందుకు టీఆర్​ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గొడవల్లో తమ లీడర్లపై నాన్​బెయిలబుల్​కేసులు పెట్టిన పోలీసులు,  ముందుగా మతవిద్వేషాలను రెచ్చగొట్టిన చల్లా ధర్మారెడ్డిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.  చల్లా ఇంటిపై దాడి కేసులో వరంగల్ సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్న  వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ సహా 44 మంది బీజేపీ నేతలకు బుధవారం షరతులతో కూడిన బెయిల్​ వచ్చింది. దీంతో నాయకులు జైలు నుంచి విడుదల కాగా, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  రాంచందర్​రావు, విజయరామారావు, గరికపాటి, చాడ  సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. పార్టీ కేడర్​ భారీగా తరలిరావడంతో పోలీసులు జైలు వద్ద ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు రామభక్తులు, బీజేపీ నేతలపై  పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ తీశారు. హన్మకొండ స్టేషన్ లో పోలీసులకు గులాబీ పువ్వులు ఇచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

జైలు నుంచి విడుదలైన నేతలు రెండు డీసీఎం వెహికల్స్​లో  ర్యాలీగా బయల్దేరగా ఒక దశలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతల రిక్వెస్టులతో పోలీసులు వాహనాలకు అడ్డుతొలిగారు. అనంతరం ములుగు రోడ్ జంక్షన్,  అలంకార్, హన్మకొండ చౌరస్తా,  పబ్లిక్ గార్డెన్, నక్కలగుట్ట, అదాలత్​ సెంటర్​ మీదుగా పార్టీ ఆఫీస్​ వరకు ర్యాలీ కొనసాగింది.