
హనుమకొండ, వెలుగు: దసరా సెలవుల నేపథ్యంలో సొంతూరు, టూర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇండ్లలో చోరీలను నియంత్రణకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారని, ప్రజలు కూడా తమవంతు బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని వెల్లడించారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా గ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇంట్లోని బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలని సూచించారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే చైన్ లాక్ వేసి పార్కు చేసుకోవాలని తెలిపారు. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే సెక్యూరిటీగా పెట్టుకోవాలని, సోషల్ మీడియాలో లొకేషన్స్, ట్రావెల్స్ ప్లాన్స్ షేర్ చేసుకోవద్దని వివరించారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఇంటి పరిసరాలను గమనించాల్సిందిగా ఇరుగుపొరుగు వారికి చెప్పాలని తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.