- ధర పెంచితే మీరేం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీత
- ఎవరు అనుమతిచ్చారో చెప్పండి
- ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి కారణం ఎవరు?
- ఇండిగో ఇష్యూపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం
- సంక్షోభంలోనూ లాభాపేక్ష చూస్తారా?
- అమాంతం ధరలు పెంచితే మీరేం చేస్తున్నారు?
- వారికి ఎవరు అనుమతిచ్చారో చెప్పండి
- ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి కారణం ఎవరని నిలదీత
- తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు ఆదేశం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం, ఆ అదను చూసుకుని ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేయడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సంక్షోభ సమయంలో ఎయిర్‌లైన్స్ అన్నీ టికెట్ రేట్లను దాదాపు రూ.40వేల వరకు ఎలా పెంచుకోగలిగాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాటికి ఎవరు అనుమతి ఇచ్చారని నిలదీసింది.
ఇండిగో సంక్షోభంపై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది?, దీనికి కారణం ఎవరు? అని కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ఒకవైపు సంక్షోభం నెలకొంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు పర్మిషన్ ఎవరిచ్చారు. టికెట్ ధర రూ.35 వేల నుంచి 39 వేల వరకు ఎలా వెళ్లింది? ఇదంతా ఎలా జరిగింది?’’ అని అడిగారు.
సమస్య తలెత్తాక చర్యలు తీసుకుంటారా ?
ఎయిర్‌లైన్స్ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వెల్లడించారు. ఆ సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. ‘‘సంక్షోభం తలెత్తిన తర్వాత మీరు ఈ చర్యలు తీసుకున్నారు. మా ప్రశ్న ఇది కాదు.. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది” అని జడ్జి అడిగారు.
‘‘"మీ ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం. అయితే, ఎయిర్‌పోర్ట్‌లలో లక్షలాది మంది ప్రయాణికులను పట్టించుకోకుండా వదిలేసి, అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఎందుకు వదిలేశారనేది మమ్మల్ని బాధపెడుతున్నది. ఇలాంటి పరిస్థితి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది” అని వ్యాఖ్యానించారు.
ప్యాసింజర్లందరికీ పరిహారం చెల్లించడానికి, సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు?” అని ప్రశ్నించారు. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారు? దీన్ని నివారించడానికి మీరేం చర్యలు తీసుకున్నారు? అని కేంద్రాన్ని కోర్టు అడిగింది. తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని, కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను పాటించాలని ఇండిగోను కోర్టు ఆదేశించింది.
ఇండిగో ఆఫీసులో డీజీసీఏ పర్యవేక్షణ బృందాలు
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు, సేవల్లో అంతరాయాలపై తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి గురుగ్రామ్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో 8 మంది సభ్యులతో కూడిన రెండు బృందాలను మోహరించింది.
ఇండిగో విమాన కార్యకలాపాలు, విమానాల రద్దు ప్రక్రియ, ప్రయాణికులకు అందించే సేవలు, కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలు లాంటి అంశాలను ఈ బృందాలు నిశితంగా పర్యవేక్షించనున్నాయి. రోజూ సాయంత్రం 6 గంటలలోపు డీజీసీఏకు నివేదికను సమర్పించనున్నాయి. విమానాలను రోజుకు 200కు తగ్గించాలనే కేంద్రం ఆదేశాల మరుసటి రోజునే డీజీసీఏ ఈ చర్య తీసుకున్నది.
స్పైస్‌జెట్ నుంచి 100 అదనపు విమానాలు
వింటర్ డిమాండ్‌ను తీర్చేందుకు 100 విమానాలను అదనంగా నడపాలని నిర్ణయించినట్టు దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పేర్కొన్నది. ప్రధాన మార్గాల్లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని..మార్కెట్‌లో తగినంత సామర్థ్యం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షెడ్యూల్ రెగ్యులేటరీ అప్రూవల్స్‌కు లోబడే ఉంటుందని పేర్కొన్నది.
220 ఇండిగో విమానాల రద్దు
ఢిల్లీ, ముంబైసహా 3 మేజర్ ఎయిర్‌పోర్ట్స్‌కు ఇండిగో బుధవారం 220 విమానాలను రద్దు చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో అత్యధికంగా 137 విమానాలు రద్దయ్యాయి. ముంబై విమానాశ్రయంలో 21 సర్వీసులు రద్దు కాగా.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు 61 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. తమ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో సీఈవో ఎల్బర్స్ ప్రకటించిన మరుసటిరోజే.. 220 విమాన సర్వీలు రద్దు కావడం గమనార్హం.

