ఈ 4 తప్పులు చేసే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభాలు రావు.. మీరూ చేస్తున్నారా చూస్కోండి?

ఈ 4 తప్పులు చేసే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాభాలు రావు.. మీరూ చేస్తున్నారా చూస్కోండి?

నెలనెలా జీతం రాగానే మనలో చాలా మంది తప్పకుండా చేసే పని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో డబ్బు పెట్టడం. కొన్నిసార్లు పోయిన నెలలో పొదుపు చేసిన మొత్తాన్ని కూడా లంప్ సమ్‌గా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కాలక్రమేణా సంపద పెరుగుతుందని నమ్ముతాం. అయితే చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు చేసి కొన్ని పొరపాట్లు, తప్పులు వారికి మెరుగైన లాభాలను అందించటానికి అడ్డంకులుగా మారుతున్నాయి. ఇన్వెస్ట్ చేసిన డబ్బు నిజంగా పనిచేసేలా చూసుకోవడానికి మీరు తప్పక గమనించాల్సిన నాలుగు సాధారణ పెట్టుబడి తప్పుల గురించి తెలుసుకుందాం.

1.  స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు SIP ఆపేయటం:
మనలో చాలా మంది చేసే తప్పు స్టాక్ మార్కెట్లలోని హెచ్చుతగ్గులకు ప్రభావితం కావటం. మార్కెట్లు చౌకగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయడానికి SIPలు రూపొందించబడ్డాయని గుర్తుంచుకోండి. పోర్ట్‌ఫోలియో నెగటివ్‌గా ఉన్నప్పుడు SIPలను ఆపడం పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద పొరపాటని వాల్యూకర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి రోనక్ మోర్జురియా చెప్పారు. అసలు ఆ సమయమే SIPలను కొనసాగించడానికి ఉత్తమ సమయం అని అన్నారు.

2. చాలా తొందరగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడం:
SIP కొద్దిగా లాభం చూపిస్తే.. ఇప్పుడే డబ్బు తీసేసుకుందాం అని అనుకుంటారు చాలా మంది ఇన్వెస్టర్లు. కానీ గుర్తుంచుకోండి SIPలో మొదటి 3-5 సంవత్సరాలు పెద్ద రాబడుల కోసం కాదు.. అది రాబడుల కోసం విత్తనాలు నాటే దశ లాంటిది. రిడీమ్ చేయకుండా కొనసాగించే ఇన్వెస్టర్ల డబ్బు నెమ్మదిగా చక్రవడ్డీ ద్వారా పెరుగుతుంది. తొందరగా విత్‌డ్రా చేసుకుంటే.. ఆ అద్భుతమైన కాంపౌండింగ్ ప్రభావాన్ని మధ్యలోనే ఆపేసినట్లే. అందుకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు నిజంగా ఓపిక అవసరం. SIPని కొనసాగిస్తూ.. కొంతకాలం పోర్ట్‌ఫోలియో చూడటం మానేయండి. అప్పుడే మ్యాజికల్ రిటర్న్స్ మీ సొంతం అవుతాయి. 

3. అధిక రాబడుల కోసం ఫండ్‌లను మార్చడం: 
పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తున్నప్పుడు వేరొక ఫండ్ అకస్మాత్తుగా అధిక రాబడిని ఇస్తున్నట్లు చూసి.. మెరుగైన లాభాల కోసం డబ్బును అక్కడికి మార్చాలని వెంపర్లాడటం మానేయాలి. ఎందుకంటే ప్రతిసారీ ఫండ్ మార్చినప్పుడు దానికి పన్నులు చెల్లించాలి రాబడులపై. అలాగే ఎగ్జిట్ లోడ్స్ కట్టాలి. దీంతో మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోతారు. అందుకే ముందుగానే రీసెర్చ్ చేసి నచ్చిన మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవటం ఉత్తమం. 

4. ఒకే ఫండ్ హౌస్ లోని అనేక స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం:
చాలా AMCలు పోర్ట్‌ఫోలియోను నిర్మించడానికి తమ ఇన్వెస్ట్మెంట్ స్టైల్, సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. అందుకే కొన్నిసార్లు ఒక ఫండ్ హౌస్‌లోని చాలా ఫండ్‌లు బాగా పనిచేస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు ఫండ్ యొక్క పెట్టుబడి శైలిని అర్థం చేసుకోవడం, ఒకే ఫండ్ హౌస్‌కు చెందిన అనేక పథకాలు లేకుండా చూసుకోవడం మంచిదని రోనక్ మోర్జురియా సూచించారు. మెుత్తానికి SIPలతో లాభాల విజయం సాధించడానికి మార్కెట్ క్రాష్‌ల సమయంలో క్రమశిక్షణతో ముందుకెళ్లటం తప్పదని గమనించాలి పెట్టుబడిదారులు.