మీకు క్రెడిట్​ కార్డు ఉందా.. కొత్త రూల్స్ తెలుసా?

మీకు క్రెడిట్​ కార్డు ఉందా.. కొత్త రూల్స్ తెలుసా?

వెలుగు బిజినెస్​ డెస్క్​: క్రెడిట్​ కార్డు కంపెనీలు ఇటీవల లేట్​పేమెంట్​ ఫీజులను భారీగా పెంచాయి. తాజాగా ఈ లిస్టులో ఐసీఐసీఐ బ్యాంకు కూడా చేరింది. ఫిబ్రవరి 10 నుంచి తమ కొత్త ఫీజు అమలులోకి వస్తుందని ప్రకటించింది. క్రెడిట్​ కార్డు పేమెంట్​ చేయడంలో ఫెయిలయితే, చెల్లించాల్సిన మొత్తం మీద వడ్డీతోపాటు, పెనాల్టీ కూడా పడుతుంది. అంతేకాదు, దీని ఎఫెక్ట్​ క్రెడిట్​ స్కోర్​ మీదా పడుతుంది. ఒక్కో బ్యాంకు ఒక్కోలా లేట్​పేమెంట్​ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏయే బ్యాంకులు ఎంత వసూలు చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీఐసీఐ 
ఐసీఐసీఐ బ్యాంక్  ఎమెరాల్డ్ క్రెడిట్‌ కార్డు మినహా మిగిలిన అన్ని కార్డులకు సంబంధించి లేటు ఫీజు ఛార్జీలను సవరించింది. డ్యూ అమౌంట్‌ రూ. 100 కంటే తక్కువుంటే ఎటువంటి లేటు ఫీజు ఉండదు. డ్యూ అమౌంట్ రూ. 1‌‌00–500 మధ్య ఉంటే రూ. 100 ను, రూ. 501–5,000 ఉంటే రూ. 500 ను, రూ. 10,000 వరకు ఉంటే రూ. 750 ని,  రూ. 25, 000 వరకు ఉంటే రూ. 900 ను వసూలు చేస్తుంది. రూ. 50 వేల వరకు ఉంటే రూ. 1,000 , రూ. 5 లక్షల వరకు ఉంటే రూ. 1,200 ను లేటు ఫీజుగా విధిస్తుంది.
ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు...
మినిమం అమౌంట్​ కట్టకపోతే లేట్​ పేమెంట్​ ఛార్జీలు వర్తిస్తాయని ఎస్​బీఐ కార్డు వెబ్​సైట్​ చెబుతోంది. ఈ లేట్​పేమెంట్​ ఫీజు రూ. 400 నుంచి రూ. 1,300 మధ్యలో ఉంటుందని పేర్కొంటోంది. చెల్లించాల్సిన అమౌంట్​ రూ. 500 లోపుంటే ఎలాంటి లేట్​ పేమెంట్​ ఫీజును ఈ బ్యాంకు విధించడం లేదు. అదే చెల్లించాల్సిన మొత్తం రూ. 50 వేలకు మించితే రూ. 1,300 లేట్​ పేమెంట్​ ఫీజు వడ్డిస్తోంది. అంతేకాదు, మినిమం అమౌంట్​ కట్టడంలో  రెండు సైకిల్స్​ వరసగా ఫెయిలైతే, అదనంగా మరో రూ. 100 లేట్​ పేమెంట్​ ఛార్జీగా విధిస్తోంది. మినిమం అమౌంట్​ కట్టేదాకా ప్రతీ పేమెంట్​ సైకిల్​కూ ఈ ఛార్జీని ఎస్​బీఐ కార్డు వసూలు చేస్తోంది.
హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డు....
క్రెడిట్​ కార్డు స్టేట్​మెంట్​లో ఉన్న మొత్తాన్ని గడువు తేదీలోపు చెల్లించాలి. ప్రాసెసింగ్​ టైమును దృష్టిలో పెట్టుకుని మరో మూడు రోజుల గ్రేస్​ పీరియడ్​ను హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఇస్తోంది. ఈ బ్యాంకు లేట్​ పేమెంట్ ఛార్జీలు రూ. 100 నుంచి రూ. 1,300 దాకా ఉంటున్నాయి. చెల్లించాల్సిన అమౌంట్​ రూ. 100 లోపుంటే లేట్​ పేమెంట్​ ఛార్జీలు వసూలు చేయడం లేదు. అదే కనక ఈ అమౌంట్​ రూ. 50 వేలకు మించితే రూ. 1,300 లేట్​ పేమెంట్​ ఫీజు వసూలు చేస్తున్నారు. 
యాక్సిస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డు...
యాక్సిస్​ బ్యాంకు కూడా కస్టమర్లపై క్రెడిట్​ కార్డు లేట్​ పేమెంట్​ ఛార్జీలు వడ్డిస్తోంది. ఈ ఛార్జీలు రూ. 100 నుంచి రూ. 1,300 మధ్యలో ఉంటాయని వెబ్​సైట్​లో పేర్కొంది. లేట్​ పేమెంట్​ ఛార్జీలు కూడా ఒక్కో కార్డుకు ఒక్కోలా ఉంటాయని తెలిపింది. 
సిటీ బ్యాంకు రివార్డ్స్​ క్రెడిట్​ కార్డు....
సిటీ బ్యాంకు క్రెడిట్​ కార్డులు వాడే వారిపై ఆ బ్యాంకు రూ. 100 నుంచి రూ. 1,300 లేట్​ పేమెంట్​ ఫీజు విధిస్తోంది. స్టేట్​మెంట్​ బాలెన్స్​ రూ. 2,000 లోపుంటే, ఎలాంటి ఛార్జీలు ఈ బ్యాంకు వేయడం లేదు. రూ. 15 వేలకి మించితే మాత్రం రూ. 1,300 లేట్​ పేమెంట్​ ఛార్జీలు విధిస్తోంది. 
సిటీ ప్రెస్టీజ్​ కార్డు...
స్టేట్​మెంట్​ బాలెన్స్​ రూ. 2 వేల దాకా ఎలాంటి ఫీజు లేదు. రూ. 2 వేలకి మించితే రూ. 100 లేట్​ పేమెంట్​ పీజు పడుతుంది.
అమెరికన్​ ఎక్స్​ప్రెస్​ కార్డు...
చెల్లించాల్సిన అమౌంట్​పై కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1,000 లేట్​ పేమెంట్​ ఫీజును ఈ కంపెనీ  వసూలు చేస్తోంది.
గడువులోపు బిల్లు కట్టకపోతే ఏమవుతుంది...
టైములోపు చెల్లించమని క్రెడిట్​ కార్డు కంపెనీలు మెసేజ్​లు, ఈమెయిల్స్​ పంపుతాయి. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే, పెనాల్టీతోపాటు, వడ్డీని వసూలు చేస్తాయి. అప్పటిదాకా ఎంజాయ్​ చేసిన ఇంటరెస్ట్​ ఫ్రీ ఫైనాన్సింగ్​ కూడా ఆ తర్వాత నెల మనకు దూరం అవుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.