బీఏసీ​లో లొల్లి.. శ్రీధర్​బాబు vs​ హరీశ్​

బీఏసీ​లో లొల్లి.. శ్రీధర్​బాబు vs​ హరీశ్​
  • కేసీఆర్​ స్థానంలో మీటింగ్​కు వచ్చిన హరీశ్​
  • అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు మీటింగ్​ నుంచి వెళ్లిపోయిన మాజీ మంత్రి

హైదరాబాద్, వెలుగు: బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్​లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే హరీశ్​ రావు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్​ఎస్​ తరఫున కేసీఆర్ ప్లేస్​లో హరీశ్ రావు మీటింగ్​కు హాజరుకావడంతో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. స్పీకర్​ ప్రసాద్​ కుమార్​ జోక్యం చేసుకున్నారు. చివరికి హరీశ్ రావు బయటికి వెళ్లిపోయాక బీఏసీ మీటింగ్​ ప్రారంభమైంది. బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్​లో కేసీఆర్, కడియం శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. తన స్థానంలో హరీశ్ రావు హాజరవుతారని స్పీకర్​కు కేసీఆర్ ఫోన్​లో సమాచారం ఇచ్చారు. స్పీకర్ అనుమతితో సమావేశంలో పాల్గొనేందుకు కడియం శ్రీహరితో కలిసి హరీశ్ స్పీకర్ చాంబర్​కు వెళ్లారు. 

హరీశ్ బీఏసీలో సభ్యు డు కాదని, అలాంటప్పుడు ఎలా హాజరవుతారని శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అనుమతితోనే తాను సమావేశానికి వచ్చానని, గతంలో తానూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశానని చెప్పారు. ఒక సభ్యుడు ఏదైనా కారణంతో హాజరుకాలేకపోతే ఆయన స్థానంలో మరొకరు పాల్గొనే వారని హరీశ్ తెలిపారు. గతంలో అనుమతించినట్టు తనకు తెలీదని శ్రీధర్ బాబు అన్నారు. గత బీఏసీ సమావేశాల రికార్డులు తెప్పించాలని.. ఒకవేళ ఒకరికి బదులుగా అదే పార్టీకి చెందిన మరో సభ్యుడిని అనుమతించి ఉండకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచే తప్పుకుంటానని హరీశ్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కల్పించుకుని సర్దిచెప్పారు. హరీశ్ చాంబర్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత రేవంత్ వచ్చారు.