మండల మీటింగ్​లో రసాభాస.. ప్రోటోకాల్ పై ఎంపీపీ, ఎంపీటీసీ మధ్య వాగ్వాదం

మండల మీటింగ్​లో రసాభాస.. ప్రోటోకాల్ పై ఎంపీపీ, ఎంపీటీసీ మధ్య వాగ్వాదం

కామారెడ్డి, వెలుగు: సదాశివనగర్​ మండల సర్వసభ్య సమావేశం బుధవారం రసాభాసగా  మారింది. ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే స్టేజీపై ప్రొటోకాల్​పాటించలేదని ధర్మారావుపేట బీజేపీ ఎంపీటీసీ   మహిపాల్​యాదవ్​ ఆఫీసర్లను ప్రశ్నించారు.  ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్, రైతు బంధు సమితి మండల ప్రెసిడెంట్, జడ్పీ కో ఆప్షన్​మెంబర్​ఎలా కూర్చుంటారని నిలదీశారు.  ఎంపీటీసీ కూడా వెళ్లి స్టేజీపై  కూర్చున్నారు. కిందకు వెళ్లాలని ఎంపీపీ సూచించగా.. ప్రొటోకాల్​పాటించనప్పుడు తానెందుకు కూర్చోకూడదని ప్రశ్నించారు. దీంతో ఎంపీటీసీతో ఎంపీపీ , జడ్పీటీసీ వాగ్వివాదానికి దిగారు.  

పోలీసులు   వచ్చి  మహిపాల్​ యాదవ్​ను బయటకు వెళ్లాలని చెప్పినా, వినక  పోవడంతో ఎంపీపీ అనసూయ  ‘కిందకు దిగి మాట్లాడు..  లేకపోతే ఈడ్చి పడేస్తాం’  అంటూ దూషించారు.  తనకు మీటింగ్​గురించి సమాచారం కూడా ఇవ్వలేదని మహిపాల్​యాదవ్​ఎంపీడీవో లక్ష్మిని  ప్రశ్నించగా  పోస్టు ద్వారా పంపానన్నారు. మీటింగ్​లో  వీడియో తీస్తున్న జర్నలిస్టులపై  ఎంపీపీ భర్త రమేశ్​ దురుసుగా వ్యవహరించారు.   గొడవ సద్దుమణిగిన కొద్దిసేపటికి  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  జాజాల  సురేందర్​సమావేశానికి వచ్చారు.  ఎలాంటి చర్చ జరగకుండానే మీటింగ్​ముగించారు. 

ఎంపీపీ భర్తపై కలెక్టర్​కు ఫిర్యాదు

సదాశివనగర్​ ఎంపీపీ అనసూయ భర్త  రమేశ్​పై  చర్య తీసుకోవాలని కోరుతూ బుధవారం కామారెడ్డి కలెక్టర్​ జితే శ్​వి  పాటిల్​కు  ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధులు  కంప్లైంట్​చేశారు. మండల పరిషత్​ మీటింగ్​కవరేజీ చేస్తుండగా,  మీడియా ప్రతినిధులను ఎంపీపీ భర్త  అసభ్య పదజాలంతో దూషించారని చర్య తీసుకోవాలని వినతిపత్రం అందించారు.