కబ్జాలను రెగ్యులరైజ్‌ చేసుడేంది?

కబ్జాలను రెగ్యులరైజ్‌ చేసుడేంది?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల క్రమబద్ధీకరణకు 2014లోని జీవో 59, ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 14లను సవాలు చేసిన కేసులో రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకోకపోగా వాటిని తక్కువ ధరకు రెగ్యులరైజ్‌ చేయడం అన్యాయమని రిటైర్డు ప్రొఫెసర్‌ అన్వర్‌ ఖాన్‌ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నంద డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. 2014 డిసెంబర్‌ 30 నాటి మొదటి జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను 2015లో దాఖలు చేశామని, ఇది విచారణలో ఉండగానే ప్రభుత్వం ఫిబ్రవరి 14న మరో జీవో ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు లాయర్ చెప్పారు. పరిమితి లేకుండా ఎంత ఆక్రమణలో ఉంటే అంత రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. దీంతో సమగ్ర వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.