- వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీల్లో కాంస్యాలు నెగ్గిన అర్జున్
- లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ
- వరల్డ్ బ్లిడ్జ్ చెస్‌లోనూ కాంస్యం నెగ్గిన తెలంగాణ జీఎం
- ర్యాపిడ్, బ్లిడ్జ్ వరల్డ్ టోర్నీల్లో పతకాలు నెగ్గిన రెండో ఇండియన్‌గా రికార్డు
- విశ్వనాథన్ ఆనంద్ సరసన వరంగల్ కుర్రాడు
చెస్ ప్రపంచంలో ఇండియా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ పేరు వినబడని చోటు లేదు. ఇప్పుడు ఆ దిగ్గజం సరసన మన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ నిలిచాడు. దోహా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు గెలిచి డబుల్ ధమాకా మోగించాడు.
దోహా: ప్రపంచ వేదికపై మన అర్జునుడు అద్వితీయ ప్రతిభ చూపెట్టాడు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ అత్యద్భుత ఆటతో రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ చెస్ ర్యాపిడ్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచిన వరంగల్ కుర్రాడు బ్లిట్జ్ పోటీలోనూ బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. దాంతో ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించి ఔరా అనిపించాడు.
విషీ 2017లో ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచి బ్లిట్జ్‌లో బ్రాంజ్ గెలిచాడు. మంగళవారం ముగిసిన బ్లిట్జ్ పోటీల్లో అగ్రస్థానంతో నాకౌట్‌కు అర్హత సాధించి బంగారు పతకంపై ఆశలు రేపిన అర్జున్ సెమీఫైనల్లో 0.5–2.5 తేడాతో ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ నొదిర్బెక్ అబ్దుసతొరోవ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. అయినా క్వాలిఫికేషన్ రౌండ్ టాపర్‌గా నిలవడం ద్వారా తను కంచు పతకం అందుకున్నాడు. విమెన్స్ ర్యాపిడ్‌లో హంపి తెచ్చిన పతకంతో మొత్తంగా ఈ మెగా ఈవెంట్‌లో ఇండియాకు మూడు కాంస్యాలు లభించాయి.
స్వర్ణంపై ఆశలు రేపి..
రెండు రోజుల కిందట ర్యాపిడ్ ఈవెంట్‌లో మూడో స్థానంతో మెప్పించిన 22 ఏండ్ల అర్జున్ బ్లిట్జ్‌లోనూ అదరగొట్టాడు. తొలి రోజు 13 రౌండ్లలో 10 పాయింట్లతో టాప్‌లో నిలిచిన అతను రెండో రోజూ అదే జోరు కొనసాగించాడు. అబ్దుసతొరోవ్‌తో ఆడిన గేమ్ సహా నాలుగు రౌండ్లలో గెలిచి రెండింటిని డ్రా చేసుకున్నాడు. మొత్తంగా 19 రౌండ్లలో అత్యధికంగా 15 పాయింట్లు సాధించిన అర్జున్ టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. దాంతో తను గోల్డ్ మెడల్ తెస్తాడని అంతా ఆశించారు. కానీ, బెస్టాఫ్ 4 బ్లిట్జ్ ఫార్మాట్ సెమీస్‌లో ఇండియా కుర్రాడు అనూహ్యంగా తడబడ్డాడు.
అబ్దుసతొరోవ్‌తో తొలి గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన అర్జున్ హోరాహోరీగా పోరాడినా 47వ ఎత్తు వద్ద ఓటమి పాలయ్యాడు. రెండో గేమ్‌లో పుంజుకునే ప్రయత్నం చేసినా అబ్దుసతొరోవ్ ఎత్తుగడల ముందు తలవంచక తప్పలేదు. 75వ ఎత్తులో పైచేయి సాధించిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు 83వ ఎత్తులో మ్యాచ్ ముగించాడు. ఫలితంగా అర్జున్ 0–2తో డీలా పడ్డాడు. ఇక మూడో గేమ్‌లో తనకు గెలిచే అవకాశం ఉన్పప్పటికీ అబ్దుసతొరోవ్ 33 ఎత్తుల్లోనే డ్రా చేసుకున్నాడు.
అతను విజయం ఖాయం చేసుకోవడంతో నాలుగో గేమ్ అవసరం రాలేదు. మరో ఇండియన్ నిహాల్ సరీన్ కొద్దిలో నాకౌట్ బెర్తు కోల్పోయాడు. 19 రౌండ్ల తర్వాత అతను 13 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కానీ, టై బ్రేక్ స్కోరును లెక్కించిన తర్వాత ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక, విమెన్స్ బ్లిట్జ్ ఈవెంట్‌లో దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి 15 రౌండ్లలో చెరో 9.5 పాయింట్లతో 22, 23వ స్థానాలతో నిరాశపరిచారు.
మాగ్నస్ డబుల్ ధమాకా.. 20వ వరల్డ్ టైటిల్ సొంతం
ర్యాపిడ్ విన్నర్ నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్ బ్లిట్జ్ టైటిల్ కూడా సొంతం చేసుకొని డబుల్ ధమాకా మోగించాడు. కెరీర్‌లో 20వ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాతాలో వేసుకొని చదరంగంలో తనకు ఎదురులేదని మరోసారి చాటిచెప్పాడు. ఫైనల్లో మాగ్నస్ 2.5–1.5 తేడాతో నొదిర్బెక్ అబ్దుసతొరోవ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 9వ సారి బ్లిట్జ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
తొలి గేమ్‌లో ఓడినా అద్భుతంగా పుంజుకొని నొదిర్బెక్‌ను ఓడించి మరోసారి వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో డబుల్ టైటిల్స్ నెగ్గాడు. విమెన్స్‌లో కజకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ బిబిసార అస్సౌబయేవా విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె2.5–1.5 తేడాతో అనా ముజుచుక్ ను ఓడించి కెరీర్‌లో మూడో వరల్డ్ బ్లిట్జ్ టైటిల్‌ను గెలుచుకుంది. దాంతో పాటు 2026 ఫిడే విమెన్స్ క్యాండిడేట్స్ టోర్నీకి కూడా క్వాలిఫై అయింది.
ఆనంద్ తర్వాత ఒకే ఎడిషన్ వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీల్లో 2 మెడల్స్ నెగ్గిన రెండో ఇండియన్‌గా అర్జున్ నిలిచాడు.
వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ గెలిచిన నాలుగో ఇండియన్ అర్జున్. ఆనంద్ (2017), హంపి (2022), వైశాలి (2024) ముందున్నారు.
