శ్రీలంక క్రికెట్‌ నాశనం అవ్వడానికి భారతీయ వ్యక్తే కారణం: శ్రీలంక మాజీ కెప్టెన్

శ్రీలంక క్రికెట్‌ నాశనం అవ్వడానికి భారతీయ వ్యక్తే కారణం: శ్రీలంక మాజీ కెప్టెన్

వన్డే ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో లంక క్రికెట్ బోర్డు పాలకమండలిని తొలగించాలని శ్రీలంక ప్రభుత్వం నవంబర్ 9 న  నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం చోటుచేసుకున్న గంటల వ్యవధిలోనే ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డు పై సస్పెన్షన్ విధించింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం కారణంగానే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే  శ్రీలంక మాజీ సారధి అర్జున్ రణ తుంగ శ్రీలంక క్రికెట్ నాశనమవడానికి  ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రెసిడెంట్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెక్రటరీ అయిన జైషా అని ఆరోపించాడు. 

శ్రీలంక క్రికెట్‌ను కూల్చివేయడానికి జైషా తన పదవిని ఉపయోగించుకున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. SLC అధికారులు, జైషా మధ్య ఉన్న సంబంధం కారణంగా వారు (BCCI) SLCని నాశనం చేశారనే రణతుంగ మాటలు సంచలనంగా మారాయి. 'జైషా శ్రీలంక క్రికెట్‌ను నడుపుతున్నాడు. అతడి ఒత్తిడి కారణంగా SLC నాశనమవుతోంది. భారతదేశంలోని ఒక వ్యక్తి శ్రీలంక క్రికెట్‌ అణచివేయాలని చూస్తున్నాడు. భారత హోం మంత్రి అయిన తన తండ్రి వల్ల మాత్రమే అతడి ఆటలు సాగుతున్నాయి'. అని  జైషాపై మండిపడ్డాడు. 

వరల్డ్ కప్ లో శ్రీలంక పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 9 మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ మ్యాచ్ ల్లో గెలిచి 2025 లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ వేటు అనేది ఆ జట్టుకు పెద్ద దెబ్బ. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకూ లంకేయులు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనలేరు.