హైదరాబాద్​లో సాయుధ పోరాట వార్షికోత్సవ సభ

హైదరాబాద్​లో సాయుధ పోరాట వార్షికోత్సవ సభ

హైదరాబాద్, వెలుగు: కులమతాలతో సంబంధం లేకుండా భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు. ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఆనాడు కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని, దాని ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు, తెలంగాణ విలీన దినోత్సవాలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. 

దీనికి ముఖ్య​అతిథిగా హాజరైన బృందాకారత్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కానీ జీ-20 సదస్సులో ‘విద్వేషాలు వద్దు’ అనే తీర్మానాన్ని మోదీ ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారని.. బీజేపీ సర్కార్ ‘చెప్పేదొకటి.. చేసేదొకటి’ అని విమర్శించారు. ‘‘ప్రజాపోరాటం ఉధృతంగా ఉన్న సమయంలో హైదరాబాద్​లో ఆర్య సమాజ్ పేరుతో, జమ్మూ కాశ్మీర్​లో ప్రజా పరిషత్ పేరుతో రాజులు, రాచరికాలకు అనుకూలంగా ప్రజల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మణిపూర్ లో ఉద్రిక్తతలు సృష్టించి అమాయక గిరిజనులను ఊచకోత కోస్తున్నారు” అని ఆరోపించారు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నేతల స్ఫూర్తితో బుల్డోజర్ రాజకీయాలను అడ్డుకుంటామన్నారు. 

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే: వీరయ్య 

సెప్టెంబర్​ 17 వేడుకల్లో పాల్గొనేందుకు అమిత్ షా, రాహుల్ గాంధీకి ఉన్న అర్హత ఏంటని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.వీరయ్య ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినోళ్లే.. సెప్టెంబర్17న హైదరాబాద్ వచ్చి వేడుకలు నిర్వహిస్తామని చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం.. కమ్యూనిస్టుల సొత్తు అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో జరిగిన సాయుధ పోరాటం వల్లే దేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనం సాధ్యమైందన్నారు. కాగా, అంతకుముందు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సభ తర్వాత ఎస్వీకే నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహించారు.