Tamannaah: బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు.. ఒజెంపిక్ పుకార్లపై తమన్నా క్లారిటీ!

Tamannaah: బరువు తగ్గడానికి ఇంజెక్షన్లు.. ఒజెంపిక్ పుకార్లపై తమన్నా క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో దాదాపు 15 ఏండ్లుగా స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఒక వైపు మూవీస్ చేయడమే కాకుండా ఐటమ్స్ సాంగ్స్ లలోనూ కనిపిస్తూ తన డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపుతోంది. వరుస హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటుండటంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో తమన్నా బిజీ బిజీగా మారింది. అయినప్పటికీ బాడీ వర్కౌట్లు చేస్తూ స్లిమ్ గా కనిపిస్తూ తన హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది.

తమన్నాపై రూమర్స్..

అయితే సినిమా పరిశ్రమలో కథానాయికలు తమ పాత్రల్లో లీనం కావడానికి, తెరపై పర్ఫెక్షన్‌తో కనిపించడానికి తీవ్రంగా శ్రమిస్తారు. బరువు పెరగడం, తగ్గడం అనేది వారికి కేవలం వృత్తి ధర్మం మాత్రమే. ఈ క్రమంలో, కొందరు సహజ పద్ధతులను అనుసరిస్తే, మరికొందరు వేగవంతమైన ఫలితాల కోసం సర్జరీలు లేదా ఇంజెక్షన్లు తీసుకుంటారనే పుకార్లు తరచూ వస్తుంటాయి. లేటెస్ట్ గా ఈ బాడీ షేమింగ్ రూమర్స్‌కు బలైంది ఈ అందాల తార తమన్నా భటియా.

శరీరానికి ఒజెంపిక్ ఇంజెక్షన్లా?

తమన్నా గత కొంతకాలంగా మరింత ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తుండడంతో, ఆమె బరువు తగ్గడం కోసం 'ఒజెంపిక్' (Ozempic) వంటి గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 (GLP-1) తరగతి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారంటూ నెట్టింట ఊహాగానాలు వైరల్ అయ్యాయి. వాస్తవానికి, ఒజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం FDA ఆమోదించిన ఔషధం. అయితే, దీనిని బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్నాకు ప్రశ్న ఎదురైంది. ఈ పుకార్లపై ఆమె సూటిగా సమాధానం ఇచ్చి, విమర్శకుల నోళ్లు మూయించారు.

►ALSO READ | గానంతో 3,800 మంది చిన్నారులకు పునర్జన్మ.. దాతృత్వంతో పాలక్ ముచ్చల్ రికార్డు!

దాచదానికి ఏమీ లేదు..

నాకు దాచడానికి ఏమీ లేదు. నేను 15 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి నిరంతరంగా కెమెరా ముందు ప్రయాణిస్తూనే ఉన్నాను అని తమన్నా చెప్పింది. సినిమాలోకి రాకముందు, వచ్చాక కూడా నేను స్లిమ్‌గానే ఉన్నాను. నా శరీరాకృతిలో నాకు కొత్తదనం కనిపించడం లేదు. సాధారణంగా ప్రతి మహిళ శరీరంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి సహజమైన మార్పులు జరుగుతాయి. కోవిడ్ సమయంలో నా బాడీ చాలా దెబ్బతింది.  ఒక వయసులో ఉన్న శరీరాకృతి ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈ మార్పులను అర్థం చేసుకోకుండా రూమర్లు సృష్టించడం సరికాదు అంటూ తమన్నా గట్టిగా బదులిచ్చారు.

బాలీవుడ్ పై మిల్కీ బ్యూటీ దృష్టి..

తమన్నా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు కొద్దిగా విరామం ఇచ్చారు. ఆమె చివరిగా తెలుగులో 'ఓదెల 2' చిత్రంలో కీలక పాత్ర పోషించిన తర్వాత మరే కొత్త తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. బాలీవుడ్‌లో రోమియో, రేంజర్‌, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టితో ఒక పెద్ద ప్రాజెక్ట్, అలాగే వివన్, రాగిణి ఎంఎంఎస్ 3 వంటి చిత్రాలలో తమన్నా బిజీగా ఉన్నారు. మరోవైపు, తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో విశాల్ సరసన ఒక సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. ఏది ఏమైనా, నిరంతరంగా తనను విమర్శించేవారికి తమన్నా తన సమాధానంతో ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, ఫిట్‌నెస్ విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు..