- జమ్మూ కాశ్మీర్‌తోపాటు హర్యానాలో సోదాలు
- ఎనిమిది మంది అరెస్ట్, అందులో ముగ్గురు డాక్టర్లు
- పోలీసుల అదుపులో ఢిల్లీకి చెందిన వైద్యురాలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులున్నారు. పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు 2,900 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 350 కేజీల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం), టైమర్లు, అసాల్ట్ రైఫిల్స్, హ్యాండ్‌గన్లు, గన్‌పౌడర్ ఉన్నాయి. వీటిని హర్యానాలోని ఫరీదాబాద్ అల్-ఫలాహ్ హాస్పిటల్‌లో పనిచేసే మెడికల్ ప్రొఫెషనల్ ముజమ్మిల్ షకీల్ నివాసం నుంచి, అనంతనాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు జమ్మూకశ్మీర్ పోలీసు ప్రతినిధి వెల్లడించారు.
ఉగ్రవాదులతో చేతులు కలిపిన డాక్టర్లు
ఉగ్రవాద నెట్‌వర్క్‌లో ముగ్గురు డాక్టర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్‌తోపాటు లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ ఉన్నారు. ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జైషే మహహ్మద్ పోస్టర్లు వేసిన కేసులో ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడు. ఇతడిని అరెస్టు చేసినట్లు ఫరీదాబాద్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. మరోవైపు.. షాహీన్ కారులో ఓ ఏకే-47 రైఫిల్ లభ్యమైంది. వీరిని విచారించగా మరికొంతమంది నిందితుల పాత్ర బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురితోపాటు శ్రీనగర్‌కు చెందిన ఆరిఫ్ నిసార్ దార్, యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్, షోపియాన్‌కు చెందిన మసీద్ ఇమామ్ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్, గందేర్బల్‌కు చెందిన జమీర్ అహ్మద్ అహంగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ ఓ చైనీస్ స్టార్, బెరెట్టా పిస్టల్స్, ఏకే 56, ఏకే క్రింకోవ్ రైఫిళ్లు, 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సామాజిక, స్వచ్ఛంద సంస్థల ముసుగులో వీరు నిధులు సేకరిస్తున్నట్టు గుర్తించామని, దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
ఐదు రోజులనుంచి విస్తృత తనిఖీలు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్, గందేర్బల్, షోపియాన్‌తోపాటు హర్యానాలోని ఫరీదాబాద్, యూపీలోని సహారన్‌పూర్‌లో పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఐదు రోజులనుంచి విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఇందులో రాడికలైజ్డ్ ప్రొఫెషనల్స్..ముఖ్యంగా డాక్టర్లు ఉన్న వైట్ కాలర్ టెర్రరిస్ట్ ఎకోసిస్టమ్ బయటపడింది.ఈ ప్రొఫెషనల్స్ పాకిస్తాన్, ఇతర దేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశానుసారం ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరు టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతుగా పోస్టర్లు అంటించడం లాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
మరో డాక్టర్ అదుపులోకి..
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో భారీ మొత్తం లో పేలుడు పదార్థాలు దొరికిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అసాల్ట్ రైఫిల్, పిస్టల్, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడాని కి ఉపయోగించిన కారు ఫరీదాబాద్ ఆసుపత్రి లో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌తో పాటు పనిచేస్తు న్న మహిళా డాక్టర్‌దని పోలీసులు గుర్తించారు. ఆమెను కూడా అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.
