57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత

57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత

57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాదు పరిషత్ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్మూర్ కు ప్రత్యేక చరిత్ర ఉందన్న కవిత... నవనాధ సాధుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం నవ సిద్ధుల గుట్ట అని చెప్పారు. దేశవ్యాప్తంగా గా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడుకున్నందునే దేశం గొప్ప స్థాయిలో ఉందని గర్వంగా చెప్పారు. వితండవాదాలను ఎదుర్కొంటూ మన ధర్మాన్ని కాపాడుతున్నామంటే అది సాదు సంతుల గొప్పతనమని ప్రశంసించారు. తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు, అండదండలు అందిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. దేశంలో అందరూ సోదరభావంతో మెలుగుతూ విశ్వ గురువుగా ఎదగాలని కోరుతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జాతిని ముందుకు నడపాలని సాదు సంతులను వేడుకుంటున్నానని అన్నారు.

150 మంది పీఠాధిపతులు ఇక్కడికి రావటం మా అదృష్టం

ఆర్మూర్ ప్రజలు అదృష్ట వంతులని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. 150 మంది పీఠాధిపతులు ఇక్కడికి రావటం తమ అదృష్టమన్న ఆయన.. మంగి రాములు మహారాజ్ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఇక్కడి ప్రజలకు ఒక దేవుడిలా మారారని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్టం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోందన్నారు. అన్ని ఆలయాల్లో దీప,ధూప, నైవేద్యాలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు.. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ జరగాలని, పీఠాధిపతులు ఆశీర్వదించాలని కోరుతున్నామని జీవన్ రెడ్డి అన్నారు. ఈ క్షేత్రంలో త్వరలో కంటి వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.