మసీదు పేలుళ్ల కేసు: హైదరాబాద్‌లోఆర్మీ కెప్టెన్ అరెస్టు

మసీదు పేలుళ్ల కేసు: హైదరాబాద్‌లోఆర్మీ కెప్టెన్ అరెస్టు
  • పేలుళ్లకు సహకారం.. సాక్షాల మాయం!

హైదరాబాద్: యూపీలోని కుశీ నగర్ మసీదు పేలుళ్ల కేసులో ఓ ఆర్మీ కెప్టెన్‌ను అరెస్టు చేశారు యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు. నవంబరు 11న జరిగిన పేలుళ్లతో ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ అష్పాక్ ఆలమ్‌కు సంబంధం ఉన్నట్లు యూపీ పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌లో పని చేసి రిటైర్ అయిన అష్పాక్ అక్కడే దాగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న అష్పాక్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.

అష్పాక్ తాత నిర్వహిస్తున్న మసీదు

ఉత్తరప్రదేశ్‌లోని కుశీ నగర్ జిల్లా బైరాగిపట్టి గ్రామంలోని మసీదులో నవంబరు 11న భారీ పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల ధాటికి మసీదు గోడలు, కిటికీలు, సీలింగ్ దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పంది. పేలుడుతో ఆ గ్రామమంతా ఉలిక్కిపడింది.

ఈ మసీదును ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ అష్పాక్ ఆలమ్ తాత నిర్వహిస్తున్నారు. పేలుళ్ల ఘటన తర్వాత దర్యాప్తు మొదలు పెట్టిన యూపీ యాంటీ టెర్రిరిస్టు స్క్వాడ్ పోలీసులు 13న మౌలానా, హీజీ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకడైన మొహమ్మద్ హాజి ఖుతుబుద్దీన్‌ను ఇంటరాగేషన్ చేసిన తర్వాత పలు నిజాలు తెలిశాయి. అష్పాక్ ఆలమ్‌కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఆ పేలుళ్లు జరిగినప్పుడు అతడు అక్కడే ఉన్నాడని తేలింది.

నవంబరు 13న అరెస్టయిన నిందితులు, నాటి పేలుడుపై పోలీసుల దర్యాప్తు ఫొటోలు

4 నెలల ముందే మసీదులో పేలుడు పదార్థాలు

మసీదులో పేలుళ్లకు ఆర్మీ హాస్పిటల్ కెప్టెన్ అష్పాక్ ఆలమ్‌కు లింక్ ఉన్నట్లు తేలడంతో పోలీసుల దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. మసీదుకు సంబంధం ఉన్నవారు సహకరించినట్లు వారి ఉన్న అనుమానాలకు బలం చేకూరింది. ఈ ఘటన జరగడానికి నాలుగు నెలల ముందు నుంచే మసీదులో పేలుడు పదార్థాలు దాచి ఉంచినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. వాటిని దాచిపెట్టడానికి, ఆ తర్వాత సాక్షాలను మాయం చేయడానికి కెప్టెన్ అష్పాక్ ఆలమ్ సహకరించాడని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. హైదరాబాద్‌లోని ఆర్మీ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న కెప్టెన్ అష్పాక్ ఆలమ్‌ ఇక్కడ పరిచయాలు ఉండడంతో పరారై సిటీకి వచ్చి దాక్కున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఇక్కడ అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి అష్పాక్ ఆలమ్‌ను యూపీకి తరలించిన కుశీనగర్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. నేడో రేపో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు చెప్పే అవకాశం ఉంది.